శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

కార్యక్రమానికి హాజరైన యడియూరప్ప.. 80వ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మోడీ

Prime Minister Modi inaugurated Shivamogga Airport

న్యూఢిల్లీః కర్ణాటకలోని శివమొగ్గలో అత్యాధునిక వసతులతో నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించారు. దీని ద్వారా కర్ణాటక రాష్ట్రానికి విమాన కనెక్టివిటీ మరింతగా పెరుగుతుందని ప్రధాని పేర్కొన్నారు. రూ.450 కోట్లతో కట్టిన ఈ ఎయిర్ పోర్టును ఆకాశం నుంచి చూస్తే కమలం ఆకారంలో కనిపిస్తుంది. కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది ఆ రాష్ట్రంలో మోడీ పర్యటించడం ఇది ఐదో సారి. ఎయిర్ పోర్టును ప్రారంభించిన తర్వాత లోపల కొద్దిసేపు ప్రధాని కలియతిరిగారు. ఎయిర్ పోర్టు అందంగా, అద్భుతంగా ఉందని చెప్పారు. కర్ణాటక సంప్రదాయం, సాంకేతికతల కలయిక కనిపిస్తోందని ప్రశంసించారు. కార్యక్రమానికి హాజరైన బిజెపి నేత, బీఎస్ యడియూరప్పతో కాసేపు మోడీ మాట్లాడారు. ఈరోజు 80వ పుట్టిన రోజు జరుపుకుంటున్న యడియూరప్పకు శుభాకాంక్షలు తెలియజేశారు.

కర్ణాటకలో మల్నాడ్ జిల్లాలుగా పిలిచే శివమొగ్గ, చిక్కమగళూరు, హసన్ జిల్లాలకు కొత్త ఎయిర్ పోర్టుతో ఎక్కువగా లబ్ధి కలగనుంది. ఈ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఇది ఊతమిస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ ‘గ్రీన్‌ఫీల్డ్ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్‌’ను కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకంలో భాగంగా నిర్మించింది. గంటకు 300 మంది ప్రయాణికులకు వసతి ఇవ్వగల సామర్థం దీని సొంతం. ప్రధాని మోడీ తన కర్ణాటక పర్యటనలో భాగంగా మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. శికారిపుర – రాణేబెన్నూరు కొత్త రైల్వే లైన్, కోటేగంగూరు రైల్వే కోచింగ్ డిపో ప్రాజెక్టులకు పునాదిరాయి వేశారు. శివమొగ్గ – శికారిపుర – రాణేబెన్నూరు కొత్త రైల్వే లైన్‌ను కేంద్రం రూ. 990 కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది.