రాష్ట్రపతి ఎన్నికల్లో 99శాతం ఓటింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన

రాష్ట్రపతి ఎన్నికల్లో 99శాతం ఓటింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. రాష్ట్రాల అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోగా..పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ఓటు వేశారు. 4,796 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 99శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 11 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో ఎమ్మెల్యేలందరూ ఓటుహక్కు వినియోగించుకున్నారని చెప్పుకొచ్చింది.

ఇక ఛత్తీస్ ఘడ్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, మిజోరం, సిక్కిం, తమిళనాడు, పాండిచ్చేరిల్లో 100శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల అధికారు తెలిపారు. పార్లమెంటు హౌస్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో 736 కి 728 మంది ఓటు వేశారని రిటర్నింగ్ ఆఫీసర్ పీసీ మోడీ ప్రకటించారు. బీజేపీ, శివసేనకు చెందిన చెరో ఇద్దరు ఎంపీలతో పాటు కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ , బహుజన్ సమాజ్ వాదీ పార్టీ,ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఓటింగ్ కు దూరంగా తెలిపారు. ఇక పోలింగ్ కోసం వివిధ రాష్ట్రాలకు పంపించిన బ్యాలెట్ బాక్సులు సోమవారం రాత్రి లోపు పార్లమెంటుకు చేరుకోనున్నాయి. వాయు, రోడ్డు మార్గాల్లో బ్యాలెట్ పెట్టెలను ఢిల్లీకి తరలిస్తున్నట్లు రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీసీ మోడీ తెలిపారు. బ్యాలెట్ బాక్సులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షణలో ఉంటాయని అన్నారు. పార్లమెంటు భవనంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్​లో ముందుగా ప్రధానమంత్రి మోడీ ఓటేశారు. అనంతరం కేంద్రమంత్రులు, ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా చివరి ఓటు వేశారు. కరోనా​తో బాధపడుతున్నప్పటికీ కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ఆర్కే సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పీపీఈ కిట్ ధరించి పార్లమెంట్​కు ఓటేసేందుకు వచ్చారు.

జులై 21న పార్లమెంట్ హౌస్​లో రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకే విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది.