ప్రశాంతంగా ముగిసిన రాష్ట్రపతి ఎన్నికలు.. ఓటు వేయని ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. రాష్ట్రాల అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోగా..పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ఓటు వేశారు. పార్లమెంటులో దాదాపు 99.18శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. ఏపీ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలకు గాను, 172 మంది శాసన సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏపీకి చెందిన వైస్సార్సీపీ ఎమ్మెల్యే మహీధర రెడ్డి హైదరాబాద్‍లో ఉండటంతో తెలంగాణ శాసన సభలో ఓటు వేశారు. టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలు నందమూరి బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి విదేశాల్లో ఉన్న కారణంగా ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని సమాచారం. కరోనా లక్షణాల కారణంగా గుంటూరు ఎమ్మెల్యే మద్దాల గిరి, పీపీఈ కిట్ ధరించి వచ్చి ఓటు వేశారు.

తెలంగాణ‌కు చెందిన 117 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ క‌మిటీ హాలులో ఏర్పటు చేసిన పోలింగ్ లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్ క‌రోనా కార‌ణంగా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. వేముల‌వాడ ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేశ్ విదేశాల్లో ఉన్నారు. దీంతో వీరిద్ద‌రూ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోలేక‌పోయారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభ్యుల ఓటు విలువ 132. మొత్తం 119 మందికి సంబంధించిన ఓట్ల విలువ 15,708.