ట్రంప్‌కు రెండు చోట్లా లభించని ఊరట

జార్జియా, మిచిగన్ లో తగ్గిన ట్రంప్‌ ఆధిక్యం

Presidential elections should be postponed-Trump
Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పీఠం ఎవరిదన్న దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు తరువాత జార్జియా, మిచిగన్ రాష్ట్రాల ఫలితాలను కోర్టులో సవాల్ చేసిన డొనాల్డ్ ట్రంప్ కు చుక్కెదురైంది. ఈ రెండు రాష్ట్రాల్లో తొలుత ట్రంప్ ఆధిక్యంలో ఉండగా, ఆపై అనూహ్యంగా బైడెన్ పుంజుకుని వచ్చిన సంగతి తెలిసిందే. జార్జియా విషయంలో 53 బ్యాలెట్ బాక్సులు ఆలస్యంగా వస్తే, వాటిని కలిపివేశారని ఆరోపిస్తూ, ట్రంప్ టీమ్ కోర్టుకెక్కింది. మిచిగన్ లో ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఈ రెండు రాష్ట్రాల న్యాయమూర్తులూ ట్రంప్ పిటిషన్లను తోసిపుచ్చారు.

జార్జియా సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి జేమ్స్ బాస్, ఈ మేరకు తీర్పునిస్తూ, బ్యాలెట్లు చెల్లవని చెప్పడానికి ఎటువంటి సాక్ష్యాలూ లభించలేదని వ్యాఖ్యానించారు. మిచిగన్ కేసులో న్యాయమూర్తి సింథియా స్టీఫెన్స్, కేసును విచారించాల్సిన ఆవశ్యకత ఉన్నట్టు భావించడం లేదన్నారు. ఇక, నెవెడా విషయంలోనూ, అందునా జనాబా ఎక్కువగా ఉన్న క్లార్క్ కౌంటీ, లాస్ వెగాస్ ఓటింగ్ లోనూ అక్రమాలు జరిగాయని ట్రంప్ అనుచురులు ఆరోపిస్తున్నారు.

ఇక, మిచిగన్, జార్జియా కోర్టు తీర్పులపై ట్రంప్ ప్రతినిధులు అధికారికంగా స్పందించలేదు. ఈ మూడు రాష్ట్రాల్లో ఓట్ల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. నెవెడాలో బైడెన్ స్వల్ప ఆధిక్యంలో ఉండగా, మిచిగన్ లో విజయం బైడెన్ పరమైంది. జార్జియాలో మాత్రం ట్రంప్ అతి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. నెవెడాలో చెల్లని ఓట్లను లెక్కించి, వాటిని బైడెన్ ఖాతాలో కలిపారని, కరోనా కాలంలో క్లార్క్ కౌంటీని విడిచి వెళ్లిపోయిన వేలాది మంది ఓట్లను తీసుకొచ్చి కలిపారని తమకు అనుమానాలు ఉన్నాయని నెవడా మాజీ అటార్నీ జనరల్, ట్రంప్ టీమ్ సభ్యుడు అడామ్ లక్సలత్ ఆరోపించారు. ఈ విషయంలో మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/