ప్రీమియర్ ఎనర్జీస్ నూతన ప్లాంట్ ప్రారంభం

రూ.483 కోట్లతో సోలార్ పరికరాల ప్లాంట్

హైదరాబాద్ : హైద‌రాబాద్ ఈ-సిటీలో సౌర ప‌రిక‌రాల ఉత్ప‌త్తి ప్లాంట్‌ను ప్రీమియ‌ర్ ఎన‌ర్జీస్ ప్రారంభించింది. ఈ కార్య‌క్ర‌మంలో ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి పాల్గొని ప్రీమియ‌స్ ఎన‌ర్జీస్‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దది, దేశంలో రెండో అతిపెద్దదైన సౌర ఫలకాలు, మాడ్యూళ్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించడం పట్ల సంతోషిస్తున్నానని కేటీఆర్ తెలిపారు. తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ఈ సోలార్ పరికరాల తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేసిందని వెల్లడించారు.

రూ.483 కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్ నిర్మాణం జరుపుకుందని, ప్రస్తుతం దీంట్లో 700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వివరించారు. త్వరలోనే రూ.1,200 కోట్లతో విస్తరించి, 2000 మంది వరకు ఉద్యోగులకు అవకాశం కల్పించనుందని తెలిపారు. ప్రారంభోత్సవం అనంతరం కేటీఆర్ ప్లాంట్ లో పర్యటించారు. ఉద్యోగులతో ఉల్లాసంగా ముచ్చటించారు.

ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థను 1995లో సురేందర్ పాల్ సింగ్ స్థాపించారు. సోలార్ సంబంధిత పరికరాలు తయారుచేసే ఈ సంస్థ భారత్ లోని పలు సంస్థలతో పాటు 30 దేశాలకు కూడా ఎగుమతులు చేస్తోంది. పీవీ సెల్స్, మాడ్యూల్స్‌ను ప్రీమియ‌స్ ఎన‌ర్జీస్ ఉత్ప‌త్తి చేస్తుంది. రూ. 483 కోట్ల‌తో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును ప్రీమియ‌స్ ఎన‌ర్జీస్ ఏర్పాటు చేసింది. రెండేళ్ల‌లో పెట్టుబ‌డుల‌ను రూ. 1200 కోట్ల‌కు పెంచ‌నున్న‌ట్లు ప్రీమియ‌స్ ఎన‌ర్జీస్ వెల్ల‌డించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/