ముగిసిన మెడికో ప్రీతీ అంత్యక్రియలు

preethi-final-rites-completed

హైదరాబాద్‌ః సీనియర్ల వేధింపులతో బలవన్మరణానికి పాల్పడి గత 5 రోజులుగా మృత్యువుతో పోరాడిన వరంగల్ మెడికల్ స్టూడెంట్ ప్రీతి అంత్యక్రియలు.. తన స్వగ్రామం మొద్రాయి గిర్ని తండాలో ముగిశాయి. ప్రీతి అవివాహిత కావడంతో సంప్రదాయం ప్రకారం చెట్టుతో పెళ్లి చేసిన అనంతరం మృతదేహాన్ని ఖననం చేశారు. తల్లిదండ్రులు, బంధువులు ప్రీతికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమె అంతిమయాత్రకు భారీగా జనం తరలివచ్చారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రీతి పాడె మోశారు. ఇదిలా ఉంటే గిర్ని తండాలో ఉద్రిక్తత నెలకొంది. ప్రీతి విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ప్రీతి మరణంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు విలపిస్తున్నారు. అంతేకాక గిర్ని తండా అంతా కూడా ఈ రోజు శోకసంద్రంలా మారిపోయింది.

కాగా,వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో పీజీ అనస్థీషియా ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న ప్రీతి.. ఫిబ్రవరి 22న మత్తు ఇంజెక్షన్‌ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఆమెను తొలుత వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స అందించారు. ఆరోగ్యం ప్రమాదకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. తొలుత వెంటిలేటర్‌పై, అనంతరం ఎక్మోపై చికిత్స అందించారు. ఐదు రోజులు మృత్యువుతో పోరాడిన ప్రీతి చివరికి తనువు చాలించింది.

మరోవైపు ప్రీతి మరణానికి తన సీనియర్ అయిన సైఫ్ అనే వ్యక్తే ప్రధాన కారణమని ఆమె కుటుంబ సభ్యులు అరోపిస్తున్నారు. ఇంకా ప్రీతీది హత్య కాదు ఆత్మహత్య అంటూ నిందితులకు శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. అంతకముందు ప్రీతి మరణంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఫలితంగా కాకతీయ మెడికల్ కాలేజీ నిర్వాహకులు అలర్ట్ అయ్యి.. రేపు యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.