మెడికల్ స్టూడెంట్ ప్రీతి బ్రెయిన్ డెడ్..కాసేపట్లో నిమ్స్ డాక్టర్స్ కీలక ప్రకటన

సీనియర్ వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్య కు పాల్పడ్డ కాకతీయ మెడికల్ కాలేజీ స్టూడెంట్ ప్రీతీ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె బ్రెయిన్ డెడ్ అయ్యిందని కాసేపట్లో నిమ్స్ వైద్యులు కీలక ప్రకటన చేయబోతున్నారని సమాచారం. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా చదువుతున్న డాక్టర్ ధరావత్ ప్రీతి బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆమెను నిమ్స్ హాస్పటల్ కు తరలించారు. అప్పటి నుండి ప్రత్యేక వైద్య బృందం ఆమెకు చికిత్స అందజేస్తూ వస్తున్నారు.

ఈ ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వెల్లడించారు. నిన్నటి వరకు నొప్పికి స్పందించిన ఆ బ్రెయిన్ ఇప్పుడు దేనికి స్పందించట్లేదని వైద్యులు చెప్పడం జరిగింది. ఈ తరుణంలో ప్రీతీ తండ్రి మాట్లాడుతూ..”ప్రీతి బ్రెయిడ్‌ డెడ్‌ అయ్యిందని వైద్యులు చెప్పారు. నిన్నటి వరకు కొంచెం ఆశ ఉండేది. ఇప్పుడు.. ప్రీతి బ్రతికే అవకాశం లేదని వైద్యులు చెప్పటంతో.. ఆశలు వదిలేసుకున్నాం. ప్రీతిది ఆత్మహత్య కాదు.. సైఫే హత్య చేశాడు. సైఫ్‌ను అత్యంత కఠినంగా శిక్షించాలి. ఈ విషయాన్ని హెచ్‌ఓడీ సరిగ్గా పట్టించుకోలేదు. సకాలంలో స్పందించి ఉంటే.. పరిస్థితి ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. ప్రీతి ఆత్మహత్యకు యత్నించిన సమయంలో కూడా.. 4 గంటలకు ఘటన జరిగితే.. 8:30కు సమాచారం ఇచ్చారు. ఈ విషయం ఎక్కడ తమ మీదికి వస్తుందోనని.. హెచ్‌ఓడీ ప్రీతి మొబైల్‌లో తమకు కావాల్సినట్లుగా సాక్ష్యాలను క్రియేట్‌ చేశారు. ప్రీతిది ముమ్మాటికీ హత్యే. ఈ ఇష్యూ మీద సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి” అని డిమాండ్‌ చేస్తున్నారు. మరోపక్క కాసేపట్లో నిమ్స్ కీలక ప్రకటన చేయనున్న నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున నిమ్స్ వద్దకు చేరుకున్నారు.