సామాన్యుడు సీనియర్ మంత్రికి ఎలా తెలుస్తాడు?

Prashant Kishore
Prashant Kishore

న్యూఢిల్లీ: కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పురీ మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత్ కిశోర్ ఎవరో తనకు తెలియదని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ప్రశాంత్ కిశోర్ సేవలను ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉపయోగించుకోనున్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించినపుడు మంత్రి మాట్లాడుతూ, ప్రశాంత్ కిశోర్ తనకు వ్యక్తిగతంగా తెలియదని, ఇంతకీ ఆయన ఎవరని అన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ ప్రచార కార్యక్రమంలో ప్రశాంత్ కిశోర్ కూడా భాగస్వామి అన్న విషయాన్ని మీడియా గుర్తు చేయగా ఆ ఎన్నికల సమయంలో తాను అక్కడ లేనని మంత్రి చెప్పుకొచ్చారు. ప్రశాంత్ కిశోర్ ఎన్‌డిఎ మిత్రపక్షమైన జెడియు ఉపాధ్యక్షుడు కూడా అన్న విషయాన్ని తెలియచేసినపుడు..ఏమో తెలిసి ఉండవచ్చు కాని ఆయనెవరో తనకు వ్యక్తిగతంగా తెలియదంటూ మంత్రి వ్యాఖ్యానించారు.

దీనిపై ప్రశాంత్ కిశోర్ శనివారం ట్విట్టర్ ద్వారా ఘాటుగా స్పందించారు. తనలాంటి సామాన్యుడు సీనియర్ మంత్రికి ఎలా తెలుస్తారని కిశోర్ వ్యాఖ్యానించారు. ఆయనో(పురి) సీనియర్ మంత్రి. నాలాంటి సామాన్యుడు ఆయనకు ఎలా తెలుస్తాడు. ఉత్తర్‌ప్రదేశ్బీహార్‌కు చెందిన నాలాంటి లక్షలాది మంది ఢిల్లీలో బతుకు పోరాటం సాగిస్తున్నారు. సీనియర్ నాయకుడైన పురి లాంటి వారికి మా గురించి ఎలా తెలుస్తుంది అంటూ ప్రశాంత్ కిశోర్ ఎద్దేవా చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/