ప్రజలకు నిజం తెలియాల్సిన అవసరం ఉంది

అందుకే ‘బాత్ బీహార్ కీ’ పేరిట ప్రత్యేక కార్యక్రమం

prashant-kishor
prashant-kishor

పట్నా: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఈరోజు ఉదయం పట్నాలో మీడియాతో మాట్లాడుతూ.. తాను బీహార్ లోని ప్రజలందరినీ కలవాలని అందుకోసం ‘బాత్ బీహార్ కీ’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నానని తెలిపారు. ఈ సందర్భంగా నితీశ్, బిజెపి పొత్తుపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపితో పొత్తు కారణంగా బీహార్ లో ఏ మాత్రమూ అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. గాడ్సేను పూజించే వాళ్లతో ఎలా కలుస్తామని ప్రశ్నించారు. బిజెపితో చేతులు కలిపిన తరువాత నితీశ్ కుమార్ పూర్తిగా మారిపోయారని, కేవలం ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయన పొత్తును కొనసాగిస్తున్నారని, అభివృద్ధిని పక్కనబెట్టారని మండిపడ్డారు. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా బీహార్ ఉందని, ఇది రాష్ట్ర ప్రజలకు అందరికీ అవమానకరమని అన్నారు.

తనకు తెలిసిన అన్ని విషయాలనూ ప్రజలందరితో పంచుకోబోతున్నానని, ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నానని ఆయన స్పష్టం చేశారు. ఈ పర్యటన ఎన్ని రోజుల పాటు సాగుతుందో చెప్పలేనని అన్నారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేయడమే ‘బాత్ బీహార్ కీ’ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. తానేమీ రాజకీయ పార్టీ పెట్టాలని భావించడం లేదని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. కాగా ప్రశాంత్‌ కిశోర్‌ గత వారంలో చెప్పినట్టుగానే, తన భవిష్యత్ కార్యాచరణపై మీడియాతో మాట్లాడారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/