నేటి నుండి ప్రాణహిత పుష్కరాలు

ప్రాణహిత జన్మ స్థలి అయిన తుమ్మిడిహెట్టి ప్రాణహిత నదీ తీరంలో నేటి నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల సమయంలో పుణ్యనదిలో స్నానమాచరిచడం, పితృదేవతలకు పిండ ప్రధానం చేయడం వంటివి చేస్తుంటారు. అయితే తెలంగాణ లో ప్రవహిస్తున్న ప్రాణహిత నది పుష్కరాలు బుధవారం నుంచి ఈనెల 24వ తేది వరకు అంటే 12రోజుల పాటు నిర్వహించబడతాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో ప్రవహిస్తున్న ఈ జీవనది పుష్కర వేడుకలకు సిద్ధమైంది.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి మండల కేంద్రానికి సమీపంలో ప్రాణహిత పుష్కరాలకు అధికారులు ఏర్పాట్లుచేశారు. బృహస్పతి మీనరాశిలోకి ప్రవేశించిన సమయంలో చైత్రశుద్ధ ద్వాదశి బుధవారం నదికి పుష్కరాలు ప్రారంభమై చైత్ర బహుళ అష్టమి 24వ తేదీన ముగుస్తాయని పండితులు పేర్కొంటున్నారు. వరంగల్‌ నుంచి కాళేశ్వరం వరకు సుమారు 200 బస్సులను నడుపనున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అదేవిధంగా కాళేశ్వరం నుంచి పుష్కరఘాట్‌ వరకు 10 మినీ బస్సుల ద్వారా భక్తులకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు.