కేసీఆర్ విజన్ ఉన్న గొప్ప నాయకుడంటూ ప్రకాష్ రాజ్ ప్రశంసలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రశంసలు కురిపించారు. గత రాత్రి కరీంనగర్‌లో నిర్వహించిన కళోత్సవాల్లో పాల్గొన్న ఆయన.. మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి జానపద కళాకారులను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులను సన్మానించారు. అనంతరం వారి ఆటపాటలను తిలకించారు.

ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ విజన్ ఉన్న గొప్ప నాయకుడని కొనియాడారు. ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టకుండా అందరి హక్కుల కోసం పోరాడుతున్న గొప్ప నాయకుడని , అలాంటి నాయకుడు దొరకడం తెలంగాణ ప్రజల అదృష్టమని ప్రకాష్ రాజ్..కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తారు. మతోన్మాదులు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దారని ప్రశంసించారు.

హరితహారం కార్యక్రమంలానే తెలంగాణ కళాకారుల ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని ప్రకాశ్ రాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణ భాషను, యాసను సినిమాల్లో హాస్య నటులకు వాడేవారని, కానీ ఇప్పుడు తెలంగాణ భాష అంటే ఏంటో అందరికీ తెలుస్తోందని ప్రకాశ్ రాజ్ అన్నారు.