ప్రజావాక్కు

స్థానిక సమస్యలపై ప్రజాగళం

Voice of the people

కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయాలి: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

పేదల కడుపులు నింపేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అంద చేస్తున్న రేషన్‌ కొందరికి అందని ద్రాక్షగా మారుతోంది. రేషన్‌ షాపులో సరుకులు తీసుకునేందుకు ఆహార భద్రతాకార్డులు రెండేళ్లుగా రాష్ట్రప్రభుత్వం జారీచేయకుండా తాత్సారం చేస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది దరఖాస్తులుపెండింగ్‌లో ఉండడం వలన అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరడం లేదు. కార్డులు లేకపోయినా,ఆధార్‌ లేక గ్రామకార్యదర్శి ఆమోద లేఖ ఆధారంగా పేదలకు ఉచితరేషన్‌ అందచేయాలన్న విజ్ఞప్తులు బుట్టదాఖలు అయ్యాయి.

కొత్తకార్డులకు ఆమోదముద్ర వేయా లని కరోనా సమయంలో కూడా కార్యాలయాల చుట్టూ లబ్ధి దారులు ప్రదిక్షిణలు చేస్తున్నా ఏంప్రయోజనం ఉండడం లేదు.

పరిశ్రమలు మూతపడడం, నిర్మాణపనులు మూతపడడం వలన కొందరు పేదలు ఉపాధి కోల్పోయారు. కార్డులు లేవన్న సాకు తో వీరందరికీ ఉచిత రేషన్‌ అందించకపోవడం అహేతుకం.

బాధ్యతారాహిత్యం: -కాయల నాగేంద్ర, హైదరాబాద్‌

ఎదుటివారి క్షేమం, మన కుటుంబ క్షేమం గుర్తించి కరోనాపట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ముప్పు చెల్లించుకోక తప్పదు.

కరోనా తగ్గుముఖం పట్టిందని మీడియాలు ప్రసారం చేయగానే బజారులో గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు.

మాస్క్‌ ధరించడం మానేస్తున్నారు. అపార్టుమెంట్‌ లలో నివసించేవారయితే ప్రేమాభిమానాలను ప్రదర్శిస్తూ పార్టీ లని, పండుగలని అధిక సంఖ్యలో బంధుమిత్రులను రప్పించు కుంటున్నారు.

ఒక ప్లాట్‌లో రాత్రిపార్టీ చేసుకొని ఇరవై మందికి పైగా బంధువులు, ఇంట్లో కుటుంబ సభ్యులు బస చేశారంటే వారికి సమాజంపట్ల ఏమాత్రంబాధ్యతగా ఉందో అర్థమవుతోంది.

ఇలా అతిగా ప్రవర్తిస్తే అది ఎదుటివారికే కాదు వారి కుటుంబానికి కూడా ప్రమాదమని గుర్తించాలి.

అద్దెకిచ్చిన ఓనర్లు, అపార్టుమెంట్‌ సెక్రెటరీ ప్రెసిడెంట్‌ చూసీచూడనట్లు తమ బాధ్యతలను మరువడం బాధ్యతారాహిత్యం అవుతుంది.

ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి:-ముచ్కుర్‌ సుమన్‌ గౌడ్‌, నిజామాబాద్‌

రైతులు పండించిన పంటను కోసిన వెంటనే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. కడ్తా కొట్టకుండా రైతులకు న్యాయం చేయాలి. కొన్న ధాన్యం పైసలు వెంటనే రైతుల బ్యాంకు ఖాతాలో వేయాలి.

భారీ వర్షాలు పడి పంట నష్టపోయిన రైతులకు సర్వే చేయించి పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. రైతులందరిని ప్రభుత్వం ఆదుకోవాలి.

స్థానిక ఎన్నికలు వెంటనే జరిపించాలి: -యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

ఆంధ్రప్రదేశ్‌లో మార్చిలో జరగాల్సిన ఎన్నికలు కొవిడ్‌ మూలం గా వాయిదా పడ్డాయి. బీహార్‌లో శాసన,దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిపేందుకు ఆ సంఘం కసరత్తు చేస్తోంది.

ఇటువంటి సమయంలో ప్రభు త్వం మోకాలడ్డటం సరికాదు. గత రెండున్నర సంవత్సరాలుగా స్థానిక ఎన్నికలుజరగనందున ప్రజాపాలన కొరవడటంతో పారి శుద్ధ్య నిర్వహణా లోపంతో కరోనా విజృంభించింది.

ప్రత్యేక అధికారుల పాలనలో అక్కడక్కడా నిధులు దుర్వినియోగం, ప్రజాసమస్యలు తీరడంలేదనే ఆవేదన ప్రజల్లో ఉంది.

గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం పూజ్యంగా మారింది. ఎన్నికల కమిషనర్‌పై ద్వేషంతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు.ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిగణన లోకితీసుకుని వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.

ఒప్పందం చరిత్రాత్మకం: -డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

భారత్‌,అమెరికా దేశాల మధ్యకుదిరిన బెకా ఒప్పందం చారిత్రా త్మకం. ఢిల్లీలో ఇరుదేశాల విదేశీవ్యవహారాల, రక్షణ మంత్రులు చర్చలు సఫలమై ఈ సహకార ఒప్పందం కుదిరింది.

దీనివల్ల భారత్‌, సైన్యానికి ప్రత్యేకించి వాయుసేనకు, క్షిపణులకు అవస రమైన ఆధునికమైన సమాచారం అందుబాటులోకి వచ్చి శత్రు శిబిరాలటార్గెట్‌లపై ఖచ్చితమైన అంచనాకు వీలుకలు గుతుంది. ప్రకృతి విపత్తుల సమయాల్లో కూడా అక్కరకు వస్తుంది.

ఈ ఒప్పందంద్వారా రక్షణ విషయంలో అమెరికా, భారత్‌లు పూర్తి స్థాయి సహకారాలకు సిద్ధపడినట్టే సైనికపరంగా ఒకరి రహ స్యాలు,బలాబలాలు మరొకరితో పంచుకొనేవిశ్వాసాన్ని పెంచు కొన్నట్టే.

ఆ మేరకు బలహీనతలని కూడా అమెరికాకు ఎరుక పరుస్తున్నట్టే. పైకిచూసినప్పుడు ఈఒప్పందాల వెనుక కారణం ఇరు దేశాలకూ చైనాతో ఈ మధ్య ఏర్పడ్డ బేధాభిప్రాయాలే.

చట్టాలంటే భయం లేదు!: -ఎం.కనకదుర్గ, తెనాలి, గుంటూరుజిల్లా

దేశంలో నిర్భయ,రాష్ట్రంలో దిశచట్టాలను తీసుకువచ్చినా మహి ళలు,బాలికలపై దాడులు యధావిధిగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విజయవాడలో జరిగిన దాడి నిర్భయ, దిశ చట్టాలు నేరస్తులలో ఎలాంటి భయం కలిగించడం లేదని అర్థమవుతోంది.

పటిష్టంగా చేసిన చట్టాలు అంతే కట్టుదిట్టంగా అమలు చేయకపోవడం వలనే ఇంకా ఇలాంటి లైంగింకదాడులు, అత్యాచారాలు అప్రతిహతంగా సాగుతున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/