ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people


రైతన్నల గోడు ఆలకించండి:-ఎల్‌.ప్రఫుల్లచంద్ర, ధర్మవరం, అనంతపురం జిల్ల్లా

కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో జాతీయ స్థాయిలో చేస్తున్న రైతుల నిరసనను కేంద్రప్రభుత్వం అర్థం చేసుకోవాలి. వారి ఇబ్బందులు స్వయంగా పరిశీలించా లి. రైతన్న సమస్యలు కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకుండా ఇప్పటికీ కాలయాపన చేస్తోంది. దాదాపు పది రోజులపైగా నిరసన చేపడుతున్న రైతుల సమస్యలు కేంద్రప్రభుత్వం సావధానంగా విని సానుభూతితో పరిశీలించి రైతులకు మేలు చేయాలి. కేంద్రం అమలు చేస్తున్న రైతుల పథకాల గురించి వివరించాలి. సమస్య ఎక్కడ వచ్చిందో చూస్తే వారికి ఇట్టే అర్థం అవుతుంది.దేశానికి వెన్నుముక రైతన్న అయితే ఆ రైతు లకు, రైతు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేదెవరు? రైతు సమస్యల పరిష్కారం కోసం కేంద్రం కాస్త చొరవ చూపాలి.

బ్యాంకుల ఏర్పాటులో పునరాలోచన చేయాలి: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరు జిల్లా

దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణలలో భాగంగా కేంద్రప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలు ప్రైవేట్‌ బ్యాంకులను తెరిచేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే ఈ సిఫార్సు లపైభిన్నస్వరాలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఆర్థిక నిపుణులతో చర్చించి సరైన నిర్ణయాన్ని తీసుకోవాలి. గత రెండేళ్లలో ఐఎల్‌అండ్‌ ఎఫ్‌,ఎస్‌,యస్‌ బ్యాంకు, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ వంటి బ్యాంకులు అనేక ఆర్థిక అవకతవకలకు పాల్పడి కోట్లాది డిపాజిటర్లను నిలువునా ముంచేశాయి. ఇక ఐసిఇఐసిఇ, హెచ్‌డిఎఫ్‌సి వంటి బ్యాంకులు సర్వీస్‌ ఛార్జీలను ఇష్టానుసారంగా పెంచేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేయడంలో ప్రభుత్వ బ్యాంకులే వైఫల్యం చెందుతున్నాయి.

కరోనా ప్రొటోకాల్స్‌ పాటించాలి: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

కరోనాపై ప్రధానమోడీ ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని సమీ క్షిస్తూ సమయానుకూలంగా చకచకా కార్యాచరణను ప్రకటిం చడం హర్షణీయం. ఇటీవల కరోనా వ్యాక్సిన్‌ పురోగతి కోసం మూడు నగరాలు పర్యటించి శాస్త్రవేత్తల బృందాలతో విస్తృతం గా చర్చలు జరిపారు. వ్యాక్సిన్‌ సరఫరాలో భారత్‌ దిక్సూచి కావాలన్న ప్రధాని ఆకాంక్షలకు అనుగుణంగా శాస్త్రవేత్తలు చిత్తశుద్ధితో కృషి చేయాలి. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ సరఫరా జరగాలన్న ప్రధానిసంకల్పం అద్వితీయం. ప్రజలంద రూ క్రమశిక్షణతో కరోనాప్రొటోకాల్స్‌ పాటించడం అవసరం.

అధ్వానంగా మారిన రహదారులు:-రమేష్‌గౌడ్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పెద్ద జిల్లా అయిన వరంగల్‌జిల్లా కేంద్రంలోని కార్పొరేషన్‌ పరిధిలోని రోడ్డు అధ్వాన్నంగా మారి వాహనదారులకు నరకాన్ని చూపిస్తున్నాయం. హన్మ కొండ బస్‌స్టాండ్‌ నుండి పద్మాక్షి దేవాలయమ నుండి హంట ర్‌ రోడ్‌ వెళ్లే దారి కంకరతేలి భారీ గోతులతో దర్శనం ఇస్తుంది. నగరంలోని అంతర్గత రహదారులు కూడా పూర్తిగా దెబ్బతి న్నాయి. అలాగే డ్రెయిన్లలో నీరు రోడ్ల మీదికి రావడం, ఎక్కడ పడితే అక్కడ చెత్తచెదారం కనిపించడం సర్వసాధారణంగా మారిపోయినది. పన్నుల రూపంలో ప్రజల నుండి కోట్లు వసూ లు చేస్తున్నారు.గ్రేటర్‌ వరంగల్‌ నగరకార్పొరేషన్‌కి కేంద్ర ప్రభు త్వం నుండి నిధులు మంజూరు అవ్ఞతున్నాయి. వివిధపనుల మీద వరంగల్‌,హన్మకొండ, కాజీపేట వచ్చేవారు. పర్యాటకులు ఈ నగరాన్నిచూసి చీ అనిచీదరించుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్లని బాగు చేయాలి.

ఇలా కూడా ఆలోచిద్దామా!: -డా.దన్నాన అప్పలనాయుడు, చీపురుపల్లి

ప్రభుత్వ భాగస్వామ్యంలోనున్న బ్యాంకులలో పలుకుబడి ఉన్న పెద్దలు రకరకాల వ్యాపారాల పేరిట వందలు,వేల కోట్ల రూపా యలు అప్పుల రూపంలో తీసుకొని తిరిగి చెల్లించుతున్న దాఖ లాలు తక్కువనే చెప్పవచ్చు. వారుకూడా రుణమాఫీల కోసం ఎదురు చూసే మాఫియాలుగా మారుతున్నారు. మన కళ్ల ముందే బడా పారిశ్రామికవేత్తలుగా తయారై అక్రమ రాజకీయా లను శాసించే స్థాయి వారిని గగనవీధులలో వీక్షిస్తున్నాం. సామాన్యుని దగ్గరకు వచ్చేసరికి తీసుకున్న అరకొర అప్పులను ముక్కుపిండి వసూలుచేస్తున్నారు.ప్రస్తుతం ఉద్యమాల పేరుతో జ్వాలలురేపుతున్న వారి వెనుక కూపీలు లాగితే కుప్పలు తెప్ప లుగా లోపాలు కనబడతాయి. కనుక చిన్నచిన్న వ్యాపారులకు మాత్రమే బ్యాంకులద్వారా అప్పులీయడం పరిమితం చేయాలి.

రైతన్నలపై రాళ్లతో దాడులా?: -యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

ఏడాది కాలంగా మొక్కవోని దీక్షతో నిర్మాణానికి భూములిచ్చిన రైతులు ఆంధ్రప్రదేశ్‌కి ఏకైక రాజధాని అమరావతినే కొనసాగిం చాలని దీక్ష చేపడుతున్నారు. వీరికి అన్ని రకాలుగా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించివేధించడంబాధాకరం.ఎవరైనా ప్రజా వ్యతి రేక చర్యలకు పాల్పడితే వారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం అరాచకశక్తులు ఊపిరిలూదేం దుకు పరోక్షంగా ఊత కర్రనిచ్చినట్టవుతుంది. దురాగతాలపై సకాలం లో చర్యలుతీసుకుంటే అల్లరిమూకలు దాడులకు దిగేవికావు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/