మహేశ్ బాబుకు ప్రభాస్ పరామర్శ..

సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కృష్ణ పార్థివ దేహాన్ని నానక్ రామగూడ లోని ఆయన స్వగృహంలో ఉంచారు. రేపు ఉదయం పద్మాలయ స్టూడియో లో అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నారు.
ఇక ఉదయం నుండి కృష్ణ ను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున సినీ , రాజకీయ ప్రముఖులు వస్తూనే ఉన్నారు. సీఎం కేసీఆర్, వెంకయ్యనాయుడు , కేటీఆర్ , హరీష్ రావు , చంద్రబాబు నాయుడు మొదలగు రాజకీయ ప్రముఖులు వచ్చారు. ఇక చిత్ర సీమ నుండి దాదాపు అందరు హాజరై , నివాళ్లు అర్పించారు.
కొద్దీ సేపటి క్రితం కృష్ణ భౌతిక కాయానికి స్టార్ హీరో ప్రభాస్ నివాళ్లు అర్పించారు. అనంతరం మహేశ్ బాబును ఓదార్చారు. మహేశ్ బాబును వ్యక్తిగతంగా కలుసుకుని కొద్దిసేపు మాట్లాడాడు ప్రభాస్. కొంత ఆలస్యంగా చేరుకున్న ప్రభాస్.. మహేశ్‌ను పలు విషయాలు అడిగి తెలుసుకున్నాడు. అలాగే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. నానక్ రామ్ గూడలోని ఆయన నివాసానికి వెళ్లి కృష్ణ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి నివాళులర్పించారు. అనంతరం ఆర్ నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ..ఇండస్ట్రీలో నేనెవరికంటే ఎక్కువ కాదు..నేనెవరికంటే తక్కువ కాదు..అని ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన మహనీయుడు కృష్ణ అని అన్నారు. ఎప్పుడు కృష్ణగారి ఆఫీస్ కళకళలాడుతూ ఉండేది. నిజంగా కృష్ణ బంగారం.. ఎంతో మంది నిర్మాతలను ఆయన నిలబెట్టారు. సక్సెస్ అయితే సంతోషం. ఒకవేళ ఫెయిల్ అయితే ఆ నిర్మాతలను పిలిచి, వారికి డేట్స్ ఇచ్చి నిలబెట్టిన మహనీయుడు, గొప్ప మనసున్న మారాజు కృష్ణ అన్నారు.