ఢిల్లీలో బొగ్గు కొర‌త…మెట్రో, హాస్పిట‌ళ్ల‌కు ప‌వ‌ర్ క‌ట్‌ !

ఢిల్లీ ప్ర‌భుత్వం వార్నింగ్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ లో తీవ్ర బొగ్గు కొర‌త ఏర్ప‌డింది. దీని వ‌ల్ల విద్యుత్తు స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇవాళ వార్నింగ్ ఇచ్చింది. కీల‌క‌మైన అవ‌స‌రాల‌కు కూడా విద్యుత్తు స‌ర‌ఫ‌రా స్తంభించిపోయే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. మెట్రోతో పాటు హాస్పిట‌ళ్ల‌ల‌కు కూడా విద్యుత్తు స‌ర‌ఫ‌రాలో స‌మ‌స్య‌లు ఏర్ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఢిల్లీ ప్ర‌భుత్వం తెలిపింది.

దాద్రి-2, ఉంచాహ‌ర్ విద్యుత్తు కేంద్రాల నుంచి విద్యుత్తు స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్ప‌డుతోంద‌ని, ఢిల్లీ మెట్రోతో పాటు ప్ర‌భుత్వ హాస్పిట‌ళ్లు, ఇత‌ర కీల‌క కార్యాల‌యాల‌కు 24 గంట‌ల విద్యుత్తును స‌ర‌ఫ‌రా చేయ‌డం సాధ్యం కాదు అని ప్ర‌భుత్వం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. అయితే ఢిల్లీకి విద్యుత్తును అందించే ప‌వ‌ర్ ప్లాంట్ల‌కు బొగ్గు కొర‌త ఏర్ప‌డిందని, కేంద్ర ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే ఆ ప్లాంట్ల‌కు బొగ్గు స‌ర‌ఫ‌రా చేయాల‌ని ఢిల్లీ మంత్రి స‌త్యేంద్ర జైన్ తెలిపారు. బొగ్గు ఆధారిత ప‌వ‌ర్ స్టేష‌న్ల నుంచే ఢిల్లీకి దాదాపు 30 శాతం విద్యుత్తు అందుతున్న‌ట్లు మంత్రి చెప్పారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/