పులిచింతలలో తెలంగాణ‌ విద్యుదుత్పత్తి నిలిపివేత

తెలంగాణ అక్ర‌మంగా విద్యుదుత్ప‌త్తి చేస్తోందంటోన్న ఏపీ

పులిచింతల: రెండు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం పెరిగిపోయిన విష‌యం తెలిసిందే. తెలంగాణ అక్ర‌మంగా విద్యుదుత్ప‌త్తి చేస్తోంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆరోపిస్తుండ‌గా, ఆంధ్ర అక్ర‌మంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంద‌ని తెలంగాణ అంటోంది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌లే నాగార్జునసాగర్ వ‌ద్ద జ‌ల విద్యుదుత్ప‌త్తిని తెలంగాణ ప్ర‌భుత్వం నిలిపేసింది. నీటి ప్రవాహం తగ్గిపోవడంతో ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలిపింది.

ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు వద్ద తెలంగాణ జెన్‌కో జల విద్యుదుత్పత్తిని నిలిపేయ‌డం గ‌మ‌నార్హం. గ‌త‌ అర్ధరాత్రి నుంచి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి కావ‌ట్లేదు. ప్ర‌స్తుతం పులిచింతల జలాశయం నీటి నిల్వ 39.64 టీఎంసీలుగా ఉంది. దీని నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. కృష్ణా బేసిన్‌లోని సాగర్‌, పులిచింతల వద్ద తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తిపై ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/