శ్రీవారి నిత్య అన్నదానంలో భోజనం చేయాలంటే భక్తులు భయపడుతున్నారు

ఒకప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు శ్రీవారి నిత్య అన్నదానంలో భోజనం చేయాలనీ తపించిపోయేవారు..కానీ ఇప్పుడు నిత్య అన్నదానంలో భోజనం చేయాలంటే భయపడుతున్నారు. కారణం భక్తులకు పెట్టె భోజనం నాసిరకంగా ఉండడమే. దేశంలోనే తిరుమల క్షేత్రం ఎంతో ప్రాముఖ్యమైంది. నిత్యం లక్షల మంది శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటుంటారు. అలాంటి పుణ్యక్షేత్రంలో భక్తులకు అందించే ఫ్రీ భోజనం ఏమాత్రం క్వాలిటీ గా ఉండడం లేదు. దీంతో భక్తులు టీటీడీ తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘తిరుమల వెంకన్నని, ప్రజలకు దూరం చేసే కుట్రలో భాగంగా.. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి నిత్యాన్నదానంలో కూడా నాసిరకం భోజనం పెడుతున్నారు. ఎవరితో అయినా పెట్టుకోండి.. ఆయనతో మాత్రం పెట్టుకోకండి. భక్తులకు నాణ్యమైన భోజనం పెట్టండి’ అని టీడీపీ పార్టీ ట్వీట్ చేసింది. దానికి ఒక వీడియోను జత చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తిరుమలలో శ్రీవారి అన్నదాన సత్రాన్ని ఏప్రిల్ 6, 1985న నందమూరి తారక రామారావు ప్రారంభించారు. భారత రాష్ట్రపతి జూలై 7, 2011న మరొక శ్రీవారి నూతన అన్నదాన నిలయాన్ని ప్రారంభించారు. దీనిని శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన కాంప్లెక్స్ అని పిలుస్తుంటారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన కాంప్లెక్స్‌ను నూతనంగా నిర్మించారు. ఈ భవనంలోని రెండు అంతస్తులలో నాలుగు పెద్ద భోజనశాలలు ఉన్నాయి. ఒక్కొక్క భోజనశాలలో ఒకేసారి వెయ్యి మంది కూర్చుని తినగలిగే సౌకర్యం ఉంది. ప్రతిరోజు 12 గంటల పాటు అన్నదానం నిర్వహిస్తారు. ఈ కాంప్లెక్స్ లో సుమారు వెయ్యి మంది సిబ్బంది పని చేస్తున్నారు. ప్రతిరోజు 70 వేల మంది భక్తులకు అన్నదానం చేయగల సామర్థ్యం ఉంది. సరిపడ భోజనంతో పాటు ప్రతిరోజు అదనంగా ఎనిమిది వేల రొట్టెలను ముద్ద పప్పుతో అందిస్తున్నారు. అత్యాధునిక యంత్రాల ద్వారా రొట్టెలను తయారు చేస్తున్నారు. కానీ ఇప్పుడు నాసిరకం భోజనం పెడుతుండడం తో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.