ఏపీ సీఎం జగన్‌ను కలిసిన మాజీ ఎంపీ పొంగులేటి

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి..శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను కలుపుతూ ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెం సమీపంలోని కట్టలేరుపై ఉన్న బ్రిడ్జి నాలుగేళ్ల కిందట వరద ఉధృతికి కొట్టుకుపోయిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని వాపోయారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం జగన్‌.. బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీనిపై సీఎం జగన్ వెంటనే స్పందించడం పట్ల శ్రీనివాస్ రెడ్డి ఆనందం వ్యక్తం చేసారు. ఇక జగన్‌ను కలిసిన వారిలో భద్రాచలం ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్‌ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి కూడా ఉన్నారు.

ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయాల విషయానికి వస్తే..రాష్ట్ర కేబినెట్‌లో మంత్రి కావాలన్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆలోచన అని.. ఆయన కూడా ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలాకాలం నుంచి యోచిస్తున్నారు. ప్రస్తుతం ఆ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన వనమా వెంకటేశ్వరరావు టీఆర్ఎస్‌లో చేరారు. అయితే ఆయన కుమారుడు రాఘవ కారణంగా వనమా ఇమేజ్ బాగా డ్యామేజ్ అయ్యింది. ఈ క్రమంలో అక్కడి నుండి పోటీ చేయాలనీ చూస్తున్నారు. మరి టీఆరఎస్ అధిష్టానం ఆ టికెట్ పొంగులేటి కి ఇస్తుందా లేదా చూడాలి.