బిఆర్ఎస్ ను వీడడం ఫై పొంగులేటి క్లారిటీ

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ ను వీడి బిజెపి లో చేరబోతున్నారని..సంక్రాంతి తర్వాత ఢిల్లీ లో ఆయన ప్రధాని మోడీ , అమిత్ షా సమక్షంలో బిజెపి కండువా కప్పుకోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను చూసి చాలామంది నిజమే అనుకోవడం మొదలుపెట్టారు. ఈ తరుణంలో పొంగులేటి..బిజెపి లో చేరడం ఫై క్లారిటీ ఇచ్చారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా బీజేపీలో చేరికపై స్పందించారు. తాను బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరాల్సి వస్తే.. దొంగచాటుగా అమెరికాలోనే లేదా ఢిల్లీలోనే కండువా కప్పుకోనని, ఢిల్లీ నడిబొడ్డున 2.50 లక్షల మంది అభిమానుల సమక్షంలో కండువా కప్పుకుంటానంటూ స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌ను వీడాల్సి వస్తే బహిరంగంగా ప్రకటిస్తానన్నారు. ఆలూ లేదు చూలు లేదు… కొడుకు పేరు సోమలింగం అన్న తరహాలో తాను బీఆర్ఎస్‌ను వీడుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని పొంగులేటి సెటైర్ వేశారు. కార్యకర్తలందరికీ అండగా ఉంటానని, తనను నమ్ముకున్న కార్యకర్తలు, అభిమానులకు న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీలోకి దిగుతానని, అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.