తీన్మార్ మల్లన్న ఆఫీస్ ఫై జరిగిన దాడిని ఖండించిన పొంగులేటి

ఆదివారం హైదరాబాద్ ఫిర్జాదిగూడలోని తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ పై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. కర్రలు, రాడ్లతో విధ్వంసం సృష్టించారు. మరణ యుధాలతో వచ్చి ఆఫీస్ లో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్, అద్దాలను పగలగొట్టారు. దాదాపు 25 మంది గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖండించారు. ప్రశ్నించే గొంతుకను అణిచివేసే ప్రయత్నం మన రాష్ట్రంలో జరుగుతుందని ఆయన అన్నారు. క్యూ న్యూస్ సంస్థ పై వారి సిబ్బంది పై జరిగిన దాడి హేయమైన చర్య అని తెలిపారు.

ఉన్నది ఉన్నట్టు… విన్నది వినట్టు ప్రజల పక్షాన ఉంటూ వారి కోసం పోరాడుతున్న మల్లన్న ను నేరుగా ఎదుర్కొనే శక్తి లేకనే ఇలాంటి కొందరు ఈ వికృత చేష్టాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అధికార పార్టీ కి చెందిన నాయకులే ఈ దాడిని చేయించి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. వెంటనే నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మల్లన్న చేయబోయే న్యాయ పోరాటానికి ఖచ్చితంగా తన మద్దతు ఉంటుందని స్పష్టం చేసారు.

మరోపక్క ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు తీర్మార్ మల్లన్న.. క్యూన్యూస్ ఆఫీస్ కి చేరుకున్న పోలీసులు..ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిలో ఒకరిని పట్టుకొని స్థానికులు చితకబాదినట్లు తెలుస్తోంది. మంత్రి మల్లారెడ్డి, కేటీఆర్, కవిత అనుచరులే తమపై దాడికి పాల్పడ్డారని మల్లన్న టీమ్ తెలిపింది. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని మల్లన్న టీమ్ డిమాండ్ చేస్తోంది.

తాను బయటకు వెళ్లినప్పుడు వచ్చి ఆఫీసుపై దాడి చేశారని తీన్మార్ మల్లన్న తెలిపారు. బీఆర్ఎస్ గుండాలే ఈ దాడికి పాల్పడ్డారని మలన్న ఆరోపించారు. నెంబర్ ప్లేట్ లేని మూడు కార్లలో వచ్చి దాడి చేశారని మల్లన్న చెప్పారు. పోలీసులకు తెలిసే దాడి జరిగిందని, ఇందులో పోలీసుల పాత్ర కూడా ఉందన్నారు. గతంలో జరిగిన దాడికి సంబంధించి ఒక్కర్ని కూడా పోలీసులు పట్టుకోలేదని మల్లన్న అన్నారు.