సంబరాల సంక్రాంతి

pongal

సంక్రాంతి వచ్చిందంటే ఊళ్లల్లో ఎక్కడ లేని సందడి మొదలవుతుంది. ఎక్కడెక్కడో స్థిరపడిన వారు సైతం సకుటుంబ సపరివార సమేతంగా పల్లెకు చేరుకుని సంతోషంగా పండుగ చేసుకుంటారు. ముగ్గులు, గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు, భోగిపళ్లు, భోగి మంటలు, గంగిరెద్దులు, కొత్త ధాన్యాలు ఈ పండుగకు ఎన్నెన్నో విశిష్ట సాంప్రదాయాలు.

భోగినాడు ఇళ్లముందు భోగి మంట వేసుకుని చలికాచుకుంటూ మంట చుట్టూ చేరి సరదాగా ఆడుకుంటారు. ఇళ్లల్లో చిన్న పిల్లలకు రేగుపండ్లు, అక్షతలు, చెరుకుముక్కలు, చిల్లరనాణాలు కలిపి భోగిపళ్లు పోసి ముత్తయిదువలు దీవిస్తారు. బాలారిష్టాలు ఏమైనా ఉంటే తొలగిపోవాలని భోగిపండ్లు పోస్తారు. ఈ సందర్భంలో పిల్లలంతా చేరి అల్లరి చేస్తుంటారు. ఎంతో సంబంరంగా ఉంటుంది. సంక్రాంతి రోజు వాకిట్లో పెద్ద పెద్ద ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మపై పసుపు, కుంకుమ, పూలు, చిరుధాన్యాలు చల్లుతారు. తెల్లవారుజామున పెట్టిన గొబ్బెమ్మలను అసుర సంధ్యవేళ తీసి పిడకలు చేస్తారు. నెలరోజుల పాటు పెట్టిన గొబ్బెమ్మ పిడకలను పండుగరోజు పొయ్యికింద వేసి ఆ మంటతో పరమాన్నం చేస్తారు. కొత్త అల్లుళ్లు, బంధువులు, పిండివంటలతో ఇళ్లన్ని కళకళలాడుతుంటాయి. నోములు ఉన్న వారు వాయనాలు ఇస్తారు. దానాలు చేస్తారు. సంక్రాంతి వచ్చిందంటే రంగురంగుల పతంగులు రెపరెపలాడుతుంటాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా చిన్నాపెద్దా అంతా చెర్కాలు, డోరీ పతంగులతో సందడి చేస్తారు. ఈ వాతావరణం పండుగకు నెల రోజుల ముందు నుండే ప్రారంభమవుతుంది. ఊర్లో ఎవరు పెద్ద గాలిపటం ఎగురవేశారు.

ఎవరు ఎన్ని పంతులకు పేంచీ వేశారనేది ఓ పోటీలా సాగుతుంది. సంక్రాంతి ఇంట్లో అరిసెలు ఘుమఘుమలాడాల్సిందే. పిండి వంటకాల్లో ఒకటైన సకినాలను సంక్రాంతికి ప్రతి ఇంట్లోను చేస్తారు. ఇక పండుగ సందర్భంగా చేసే నువ్వుల ఉండలు, బెల్లం, నువ్వులతో చేసే ఈ ఉండలను పండుగనాడు పెద్దలు చిన్నవారికి ఇచ్చి ‘నువ్వులు తిని నూరేళ్లు బతుకు అని దీవిస్తారు. కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి సందర్భంగా తమ చిన్నారు కోసం ఇంటి ప్రాంగణంలో బొమ్మరిల్లు వేస్తారు. ఒక వరుస ఇటుకలతో దీన్ని అందమైన పొదరిల్లుగా తీర్చిదిద్దుతారు. అందులో చిన్న పొయ్యి, ఇతర ఏర్పాట్లు అచ్చంగా ఇంట్లో ఉన్నట్లు చేస్తారు. సంక్రాంతి రోజున సాయంత్రం ఇరుగు పొరుగు ఇళ్లలోని చిన్నారులంతా అక్కడి చేరుకుని చిరుతిళ్లతో సందడి చేస్తారు. ఈ రోజున ఇంటి ప్రధాన గుమ్మం ముందు పాలు పొంగించడం కొన్నిచోట్ల చేస్తారు. ముందుగా ఆ ప్రాంతాన్ని జాజు, సున్నంతో అలికి చుట్టూ గొబ్బెమ్మలు పెట్టి ఓ దారం కడతారు.
ఒక వైపు దేవుడి పటం పెట్టి, మధ్యలో పిడకలపై గురిగి పెట్టి అందులో పాలు పొంగిస్తారు. పాలచుట్టూ కూరగాలు, ఇతర పదార్థాలు నివేదిస్తారు. సంక్రాంతి రోజు నోము నోచుకోవడం కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇరుగు పొరుగువారు, స్నేహితురాళ్లు, బంధువుల మధ్య చక్కని సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకునేందుకు ఈ నోములు ఉపకరిస్తాయి. ముఖ్యంగా పెళ్లి అయ్యాక మొదటి నోము అతివలకు

విశిష్టమైనది భావిస్తుంటారు. కొత్త కుండలను సైతం నోముకుంటారు. పసుపు, కుంకుమ, నువ్వుల ఉండలు, చిన్న సైజులో ఉండే ఒక వస్తువుతో పాటు ముత్తయిదువులకు వాయనంగా ఇస్తారు. తులసివనం, బృందావనం, కుచేల మాటలు, తమ్మునికి తలంబ్రాలు – మరదలికి మాణిక్యాలు ఇలా ఆకర్షణీయమైన పేర్లతో నోములు ఉంటాయి. ఈ సారి మొక్కలను నోముకుని పర్యావరణ పరిరక్షణకు పాటుపడతామంటూ కొన్ని సామాజిక మాధ్యమాల్లో చర్చ జరగడం విశేషం. సంక్రాంతి వచ్చిందంటే చాలు ధాన్యరాశులతో పాటే రకరకాల కళాత్మక జానపదులతో ఊరంతా కళకళలాడిపోతుంటుంది. ఒకప్పుడు
రకరకాల జానపదులు మనవన సాంస్కృతిక కళా రూపాల్ని ఊరిలో ప్రదర్శించి, తృణమోపణమో తీసుకుని సంతోషంగా ఉండేవారు. ఆధునిక వినోదాల తాకిడితో అవన్నీ కనుమరుగవుతున్నాయి.
మెడలో దండ, చేతిలో చిడతలు, తంబూరాతో ‘హరిలో రంగ హరి.. హరిలో రంగ హరి అంటూ ల్లిల్లూ తిరుగుతూ ఈ నెల రోజులూ పల్లెల్లో వీధివీధినా సందడి చేసే హరిదాసులు. రంగురంగుల పట్టు వస్త్రాలతో కాళ్ల నుంచి కొమ్ముల దాకా బసవన్నలను అందంగా అలంకరించుకుని బూరలు ఊదుతూ ఇంటింటికి వచ్చి అయ్యవారికి దండం పెట్టూ, అమ్మవారికి దండం పెట్టు అంటూ తమకు చిల్లర పైసలు, ఎద్దుకు వడ్లు అడుగుతూ తిరిగే గంగిరెద్దుల వారు ఇప్పుడు చాలా తక్కువగా కనిపిస్తున్నారు.

గొడుగు వేసుకుని డమరుకం వాయిస్తూ అంబపలుకులతో ఇంటింటి భవిష్యవాణి వినిపించే బుడబుక్కల స్వాములు పల్లెల్లోను కనిపించడం లేదు. రోజుకో వేషం వేసుకుని, హాస్యం, భయంతో సహా సకల రసాలను పలికిస్తూ.. చివరి రోజు శక్తివేషంతో ఊరంతటినీ ఉరికించి, వినోదం అందించే పగటి భాగవతులు.. తలపై పెద్ద కిరీటం, చేతిలో గంట, నుదిటిపై విభూది పట్టీలు, మెడలో శంఖంతో వచ్చి గంట నిండా ధాన్యం పెట్టమంటూ శుభోదయం పలికే జంగం దేవరలు అప్పటి వారికి తెలిసే ఉంటుంది. భుజాన కావిడి, కావిడి బద్ద పొడుగునా గొట్టంతో వచ్చి గొట్టం విప్పితే ఏయే తప్పులకు నరకంలో ఏయే శిక్షలో కళ్లకు కట్టి చెప్పే జనం ఇచ్చే సంభావనలను స్వీకరించే కాశీబ్రాహ్మడు.. నెమలీకలు తలకు కట్టుకుని గంభీరమైన వేషధారణలో పాట పాడుతూ కంచు శిబ్బెని మోగిస్తూ శివయ్యను స్మరించే చెంచు దొరలు. ఒకప్పుడు ఊళ్లోకి ప్రవేశం లేక ఊరి పొలిమేర నుంచే ప్రత్యేక వాద్యం వాయిస్తూ పాటలు పాడే డొక్కలవారు. కోసిన కోత కొయ్యకుండా వసపిట్టలా బడాయి కబుర్లు చెబుతూ ఆనందపరిచే పిట్టల దొరలు.
గవ్వలతో కుట్టిన గొంగడి ధరించి, ఒంటికి గొంగడి వస్త్రాన్ని కప్పుకుని పిల్లన గ్రోవి వాయిస్తూ భిక్షమెత్తుకునే గొరవయ్యలు. పోతరాజులు, కాటికాపర్లు, కోతులు ఆడించేవారు.
ఎలుగును తెచ్చేవారు. ఇలా అనేకానేక వృత్తుల వారు, జానపదులు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి పల్లెలోనూ సందడి చేసే వారు. ఇవన్నీ ఒకనాటి ముచ్చట్లు గ్రామాల్ని పట్టణాలు కబళించాక పల్లెజీవులు పట్టణ వాతావరణానికి అలవాటుపడ్డారు. ఈ ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు కనుమరుగవుతున్నాయి. కొన్నిచోట్ల సంక్రాంతి సంబరాల పేరుతో కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లలను అటువంటి చోట్లకు తీసుకెళ్లి చూపిస్తే పండుగ విశిష్టత ఎటువంటిదో వారికి కొంతైనా తెలుస్తుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/