అంచనాలను అందుకోలేకపోతున్న పొలార్డ్‌

Kieron Pollard
Kieron Pollard

ముంబయి: టీ20ల్లో అతనో అరవీర భయంకర ఆటగాడు. బ్యాటు పట్టినప్పుడు బౌలర్లకు వణుకు పుట్టించే బ్యాట్స్‌మెన్‌…బంతి తీసుకున్నప్పుడు బ్యాట్స్‌మెన్‌ను చుక్కలు చూపించే బౌలర్‌…అంతేనా…ఫీల్డింగ్‌లో ఉన్నప్పుడు బౌండరీ అవతల పడే బంతులను సైతం అందుకొని బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌ పంపించే ఫీల్డర్‌…మొత్తానికి ఓ ఉత్తమ ఆల్‌రౌండర్‌…ఎన్నోసార్లు ఓటమి అంచుల్లో ఉన్న తమజట్టును ఒంటిచేత్తో ఒడ్డున పడేసిన సమర్థడు. ముంబయి మ్యాచ్‌ గెలిచిందంటే అందులో పొలార్డ్‌ భాగస్వామ్యం లేకుండా ఉండేది కాదు. 2010లో రూ.7.5కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి మరీ ఈ కరేబియన్‌ ఆటగాడిని ముంబయి జట్టు సొంతం చేసుకుంది. తాను తీసుకున్న మొత్తానికి న్యాయం చేస్తూ…ముంబయిని ఎన్నో మ్యాచుల్లో గెలిపించాడు. అందుకే పొలార్డ్‌ను ముంబయి జట్టు వదులుకోవడానికి ఇష్టపడలేదు. ప్రతి వేలంలోనూ తనతోనే అట్టిపెట్టుకొంటూ వస్తోంది. అందుకు తగ్గట్గుగానే సంవత్సరాల తరబడి పొలార్డ్‌ జట్టు నమ్మకాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. మరి అలాంటి పొలార్డ్‌కు ఏమైంది…? ఈ మధ్య ఎందుకు అంచనాలను అందుకోలేకపోతున్నాడు…? పొలార్డ్‌ పనైపోయిందా…? గత ప్రదర్శనలు చూస్తే ఈ అనుమానం రాకమానదు. ఈ సీజన్‌లో ముంబయి ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఆడిన పొలార్డ్‌ చేసింది కేవలం 50 పరుగులు మాత్రమే. ఈ ఆల్‌రౌండర్‌ మీదే ఎక్కువగా ఆధారపడే ముంబయి జట్టు ఆడిన మ్యాచుల్లో రెండింట్లో ఓటమికి ఇవీ కారణాలు కావచ్చు. అయితే పొలార్డ్‌ ప్రదర్శనపై స్పందించిన ముంబయి ఇండియన్స్‌ యాజమాన్యం పొలార్డ్‌ తిరిగి ఫామ్‌లోకి వస్తాడని నమ్మకం వ్యక్తం చేసింది. బుధవారం రాత్రి చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7బంతుల్లో 2సిక్సర్ల సాయంతో 17 పరుగులు చేసిన పొలార్డ్‌ ఒక కళ్లు చెదిరే క్యాచ్‌ సైతం అందుకున్నాడు. దీంతో పొలార్డ్‌ ఫామ్‌లోని వచ్చినట్లే అనిపిస్తోంది. కానీ తెలివిగా బంతులు వేసి వికెట్లు తీసే సత్తా ఉన్న బౌలర్‌ అయినప్పటికీ పొలార్డ్‌కు జట్టు సారథి రోహిత్‌ శర్మ బౌలింగ్‌ ఇవ్వలేదు. మరి బ్యాటుతో లయ అందుకున్నట్లే కనిపిస్తున్న ఈ ఆల్‌రౌండర్‌…ఆల్‌రౌండర్‌ ప్రదర్శన ఎప్పుడు ఇస్తాడో వేచిచూడాల్సిందే.

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/