నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన నక్కా ఆనందబాబు

గుంటూరులోని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు..పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇటీవల విశాఖ జిల్లా చింతపల్లిలో జరిగిన కాల్పులకు సంబంధించి.. ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల సహకారం లేకుండా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయా? అంటూ సోమవారం ఆనందబాబు మీడియాతో మాట్లాడుతూ ఆధారాలు లేని ఆరోపణలు చేశారు. గంజాయి అమ్మకాల వెనుక ఎవరి హస్తం ఉందో స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతూ నర్సీపట్నం సీఐ కే. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు గుంటూరులోని ఆనందబాబు నివాసానికి సోమవారం రాత్రి వచ్చారు.

ఆ సమయంలో ఆనందబాబు పోలీసులపై పరుషంగా వ్యాఖ్యలు చేశారు. మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న తాను ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క విశాఖలోనే కాదని, రాష్ట్రం మొత్తం గంజాయి దొరుకుతోందని అన్నారు. గుంటూరులోనూ ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతోందన్నారు. నల్గొండ జిల్లా పోలీసులు వచ్చి, నాలుగు రోజులు ఏపీలో ఉన్నారని, ఓ మాజీ మంత్రిగా దీనిపై మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా? అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఆధారాలు ఇచ్చే బాధ్యత తనది కాదని అన్నారు. అక్కడితో ఆగకుండా ‘మీ బతుకులేంటి మీరేంటి.. నాకే నోటీసులు ఇచ్చేందుకు వస్తారా’.. అంటూ పోలీసులపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అదే సమయంలో ఆనందబాబు ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా పోలీసుల తీరుపై మండిపడ్డారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టాల్సింది పోయి, దానిపై మాట్లాడే వారిని అడ్డుకోవడం దుర్మార్గమని ఆలపాటి మండిపడ్డారు.