ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు నోటీసులు జారీ

rajasingh

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ 41(ఏ) కింద ఆయనకు షాహినాయత్ గంజ్, మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు అందించారు. అయితే, పోలీసుల తీరుపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత కేసుల్లో తనను అరెస్టు చేసేందుకు కుట్ర పన్నారని అన్నారు. ఈ నోటీసులను నిన్ననే సిద్ధం చేశారని, ఈరోజు తనకు అందించారని అన్నారు. కేసులు నమోదైన ఆరు నెలల నుంచి పోలీసులు ఏం చేశారని ఆయన నిలదీశారు. ఈ నోటీసులపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పోలీసులు ఆదేశించారు. అయితే తెలంగాణ పోలీసులు తనను ఈరోజు అరెస్ట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.

ఇక మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్​ విడుదల చేసిన వీడియోతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. సదరు వీడియో వైరల్​ కావటంతో.. రాజాసింగ్‌పై హైదరాబాద్‌లోని పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తమ మనోభావాలను దెబ్బతీసేలా రాజాసింగ్​ వ్యాఖ్యానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ వర్గపు యువత.. ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. పలువురు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం ఉదయం రాజాసింగ్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అటు రాజాసింగ్ ఇంటి పరిసరాలతో పాటు పాతబస్తీలో భారీగా బలగాలను మోహరించారు.ఇదిలా ఉంటే.. హైదరాబాద్ పాతబస్తీలో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు పూర్తి స్థాయిలో ఓల్డ్‌ సిటీని తమ అధీనంలోకి తీసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు.