ఢిల్లీలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ నివాసం వద్ద పోలీసుల మోహరింపు

ఢిల్లీ లోని బిఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న ఎమ్మెల్సీ కవిత ..ఈరోజు ఈడీ ఎదుట హాజరుకాబోతున్న తరుణంలో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీకి చేరుకున్నారు. వీరంతా ఢిల్లీలో ఆందోళన చేసే అవకాశం ఉందన్న సమాచారంతో.. ముందస్తుగా ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఎం కేసీఆర్‌ నివాసం, ఈడీ ఆఫీస్‌ దగ్గర పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోపక్క కొద్దీ నిమిషాల్లో ఎమ్మెల్సీ కవిత ఈడీ ఆఫీస్ కు చేరుకోబోతున్నారు. ఈ నెల 11న ఈడీ ముందు హాజరైన కవితను అధికారులు సుమారు 9 గంటల పాటు ప్రశ్నించారు. 16వ తేదీన మళ్లీ హాజరుకావాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈడీ ముందు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. లిక్కర్‌ పాలసీ రూపకల్పన, సౌత్‌గ్రూపు పాత్ర, ఆప్‌ నేతలకు ముడుపులు తదితర అంశాలపై ప్రశ్నించడంతో పాటు బుచ్చిబాబు, అరుణ్‌పిళ్లైతో కలిపి విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా ఇద్దరినీ విచారించారని.. సాక్ష్యాల ధ్వంసం, మద్యం విధాన రూపకల్పన, హోటళ్లలో భేటీ వంటి అంశాలపై లోతుగా ప్రశ్నించారని సమాచారం.