సైదాబాద్ బాలిక హత్య కేసు.. పోలీసుల అదుపులో నిందితుడు రాజు

ఆరేళ్ల బాలికపై అత్యాచారం, ఆపై హత్య
నిందితుడు రాజును తన స్వగ్రామంలో అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్ : సైదాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన బాలిక హత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో కీలక నిందితుడైన రాజును యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. సింగరేణి కాలనీలో అదృశ్యమైన ఆరేళ్ల బాలిక మృతదేహం పక్కింట్లో నివసించే నిందితుడు రాజు ఇంట్లో కనిపించింది. దీంతో రాజు కోసం గాలించిన పోలీసులు మొత్తం 10 బృందాలను రంగంలోకి దించారు. ఎట్టకేలకు అతడిని తన స్వగ్రామంలోనే అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు, నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత కుటుంబ సభ్యులు నిన్న చంపాపేట నుంచి సాగర్ వెళ్లే రోడ్డుపై బైఠాయించిన నిరసన తెలిపారు. దాదాపు ఏడు గంటలపాటు నిరసన తెలిపిన బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్ హామీతో విరమించారు. ప్రభుత్వం తరపున బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామని, డబుల్ బెడ్రూం ఇల్లు, పొరుగు సేవల విభాగంలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, తక్షణ సాయం కింద రూ. 50 వేలు అందజేశారు. అలాగే, బాధిత కుటుంబంలోని మరో ఇద్దరు పిల్లలకు ఉచిత విద్య అందిస్తామన్నారు. కాగా, బాలికపై అత్యాచారం అనంతరం గొంతు నులిమి హత్య చేసినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/national/