పోలీసులకు చిక్కిన చెడ్డీగ్యాంగ్..

గత కొద్దీ రోజులుగా విజయవాడ , గుంటూరు లలో హల్చల్ చేస్తూ , ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న చెడ్డీ గ్యాంగ్ గుజరాత్‌లో పట్టుబడ్డారు. ఈ గ్యాంగ్‌కు చెందిన ముగ్గురిని గుజరాత్‌లోని దాహోద్‌లో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మిగిలిన వారి ఆచూకీ కోసం వారిని ప్రశ్నిస్తున్నారు. చెడ్డీగ్యాంగ్‌లో ఒక్కో దాంట్లో ఐదుగురు చొప్పున రెండు ముఠాలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ముఠా ఈ నెల 7న పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోరంకి, వసంత్‌నగర్‌లో చోరీలకు పాల్పడింది. ఆ తర్వాత ముఠా కదలికలు ఆగిపోయాయి. నిఘా పెరగడంతో ముఠా గుజరాత్ చెక్కేసినట్టు అనుమానించిన పోలీసులు రెండు బృందాలను ఆ రాష్ట్రానికి పంపారు. చెడ్డీగ్యాంగ్ సభ్యులు ఉపయోగించిన ఫోన్ల ఆధారంగా వీరి ఆచూకీని కనిపెట్టారు. గత నెలలో రైలులో గుజరాత్ నుంచి వచ్చిన ముఠా విజయవాడలో దిగింది. అనంతరం ఓ రోజు మొత్తం వివిధ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి ఇళ్లను ఎంపిక చేసుకుంది. అనంతరం చిట్టినగర్, గుంటుపల్లి, పోరంకిలో చోరీలకు పాల్పడింది.