తాను బ‌తికి ఉండ‌గా పోలవరం పూర్తవడం అసాధ్యం : ఉండ‌వ‌ల్లి

ఇన్నేళ్లయినా ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదని నిలదీత

undavalli arun kumar
undavalli arun kumar

అమరావతిః మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బతికి ఉండగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడో వైఎస్ఆర్ హయాంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాకపోవడానికి కారకులెవరని నిలదీశారు. ఇటీవల వచ్చిన వరదలకు ప్రాజెక్ట్ డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి కారకులు ఎవరు? ఎవరిని బాధ్యులను చేస్తారు? ఎవరిపై చర్యలు తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలని కోరారు. ఏపీ ప్రభుత్వం పోలవరం నిర్మాణ పనులపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. గతంతో తాను చెప్పిందే మంత్రి అంబటి రాంబాబు చెబుతున్నారంటూ, అందుకు అభినందనలు తెలియజేశారు.

కాగా, ఉండవల్లి వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ‘‘అయ్యా ఉండవల్లీ మీ ఊసరవెల్లి మాటలు ఆపేయండి. గతంలో 10 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా కేంద్రంలో అధికారంలో ఉండి పోలవరానికి ఏం చేశావ్? అని ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. నీ ఉనికి కోసం మాట్లాడే ఈ ఊసరవెల్లి మాటలను ప్రజలు నమ్మరు’’ అని విష్ణువర్థన్ రెడ్డి ట్వీట్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/