అధికారంలోకి రాగానే పోలవరం ముంపు ప్రాంతాలను ప్రత్యేక జిల్లా చేస్తాం – చంద్రబాబు

అధికారంలోకి రాగానే పోలవరం ముంపు ప్రాంతాలను ప్రత్యేక జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. భారీ వర్షాలు , వరదలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గోదావరి ఉగ్ర రూపం దాల్చడంతో వందల ఇల్లు నీటమునగా, కోట్ల నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో ముంపు గ్రామాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఇప్పటికే గోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు..ఈరోజు ఏలూరు తో పాటు భద్రాచలం ముంపు గ్రామాల్లో పర్యటించారు.

ఏలూరు జిల్లా వేలేరుపాడులోని శివకాశీపురం బాధితుల ఇళ్లు, ఆశ్రమ పాఠశాలలోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన బాబు… బాధితుల్ని పరామర్శించారు. అమరావతి రైతులు అందించిన నిత్యావసర సరుకులను చంద్రబాబు బాధితులకు పంపిణీ చేశారు. ప్రజలు తిరగపడతారనే భయంతోనే జగన్‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని చంద్రబాబు విమర్శించారు. అధికారంలోకి రాగానే పోలవరం ముంపు ప్రాంతాలను ప్రత్యేక జిల్లా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ముంపు బాధితులందరినీ ఆదుకుని తీరుతామన్నారు. పోలవరం కాంటూర్ లెవల్ 41.15వరకు వారికే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తానంటే తగదని.. కాంటూర్ లెవల్ 45.75వరకు ఉన్న వారికి నష్ట పరిహారం ఇచ్చి తీరాలని డిమాండ్‌ చేశారు. వరద బాధితులకు జగన్ ప్రభుత్వం 2 వేలు రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుందని చంద్రబాబు ధ్వజమెత్తారు.