తన ప్రభుత్వం దేశానికి సేవ చేసేందుకు నిజాయితీతో ప్రయత్నిస్తోంది

YouTube video
PM Shri Narendra Modi addresses public meeting in Atkot, Gujarat

గాంధీ నగర్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఆయన శనివారం పర్యటించారు. రాజ్‌కోట్‌లోని అట్కోట్‌లో శ్రీ కేడీ పర్వాడియా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మోడీ నేడు జాతికి అంకితం చేశారు. నేడు గుజరాత్ గడ్డపైకి వచ్చానని, గుజరాతీలందరికీ తాను శిరసు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. మాతృభూమికి సేవ చేయడంలో ఏ అవకాశాన్నీ తాను వదిలిపెట్టలేదని చెప్పారు. సమాజం కోసం ఏ విధంగా జీవించాలో గుజరాతీలు తనకు నేర్చారన్నారు. గుజరాతీలు నేర్పిన విద్య, విలువల వల్ల తాను జన్మభూమికి సేవ చేసే ఏ అవకాశాన్నీ వదిలిపెట్టలేదన్నారు. తన ప్రభుత్వం మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ బోధనలను అనుసరిస్తూ దేశానికి సేవ చేసేందుకు నిజాయితీతో ప్రయత్నిస్తోందని ప్రధాన చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలనను పూర్తి చేసుకోబోతోందన్నారు.

కేంద్రంలో ఏర్పడిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశ సేవలో ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకుంటోందన్నారు. ఈ ఎనిమిదేళ్ళలో తాము పేదలకు సేవ చేయడం, వారి సంక్షేమం కోసం కృషి చేయడం, సుపరిపాలనను అందించడానికే ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి నమ్మకం, అందరి కృషి’ అనే మంత్రాన్ని తాము అనుసరిస్తున్నామని చెప్పారు. దేశాభివృద్ధికి నూతన ప్రేరణను ఇచ్చామన్నారు. మహాత్మా గాంధీ , సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కలలుగన్న భారత దేశాన్ని నిర్మించేందుకు ఈ ఎనిమిదేళ్ళలో నిజాయితీగా కృషి చేశామని చెప్పారు. పేదలు, దళితులు, బాధితులు, గిరిజనులు, మహిళలు సాధికారులను చేసే భారత దేశం కావాలని మహాత్మా గాంధీ కలలు కన్నారన్నారు. పారిశుద్ధ్యం, ఆరోగ్యం జీవన విధానంగా ఉన్న సమాజం కోసం కలలుగన్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు దేశీయ పరిష్కారాలు ఉండాలన్నారని తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/