కేంద్ర బడ్జెట్ 2023 పై ప్రధాని మోడీ వ్యాఖ్యలు

అందరి ఆకాంక్షల బడ్జెట్.. ప్రధాని మోడీ..

PM Modi’s remarks on Union Budget 2023

న్యూఢిల్లీః కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం అనంతరం ప్రధాని మోడీ పార్లమెంట్‌లో ప్రసంగించారు. బడ్జెట్‌లో అనేక ప్రోత్సహాకాలు ప్రకటించామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అమృత్ కాల్ మొదటి బడ్జెట్ అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి బలమైన పునాదిని నిర్మిస్తుందని మోడీ పేర్కొన్నారు. ఈ బడ్జెట్ పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, రైతులతో సహా అందరి ఆకాంక్షలను, కలలను నెరవేరుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్‌ భారత అభివృద్ధితోపాటు గొప్ప సంకల్పాన్ని నెరవేరుస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. మహిళల కోసం ప్రత్యేక పొదుపు పథకాన్ని ప్రారంభించామని.. మహిళా సాధికారత కోసం ఎన్నో చర్యలు చేపట్టినట్లు ప్రధాని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని వివరించారు.

దేశం కోసం కష్టపడి పనిచేసిన ‘విశ్వకర్మ’ ఈ దేశ సృష్టికర్త అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తొలిసారిగా ‘విశ్వకర్మ’ శిక్షణ, సహాయానికి సంబంధించిన పథకాన్ని బడ్జెట్‌లో తీసుకొచ్చినట్లు వివరించారు. PM విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ ద్వారా సంపద్రాయ వృత్తుల వారికి చేయూతను అందించనున్నట్లు వివరించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళల జీవితాలను సులభతరం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.. మహిళా స్వయం సహాయక సంఘాలు వారి జీవితాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఇళ్లలో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రత్యేక పొదుపు పథకం ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు.