ప్రధాని సర్టిఫికెట్ల వివాదంపై స్పందించిన అజిత్ పవార్

మోడీ డిగ్రీలపై స్పష్టత వస్తే ద్రవ్యోల్బణం తగ్గిపోతుందా.. ఉద్యోగాలు వస్తాయా అంటూ ప్రశ్న

ajit-pawar

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలకు సంబంధించిన వివాదంపై తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్సీపీ) లీడర్ అజిత్ పవార్ స్పందించారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో మోడీని గెలిపించింది ఆయన ఛరిష్మానే తప్ప ఆయన డిగ్రీలు కాదని తేల్చిచెప్పారు. ప్రజలు ఆయన డిగ్రీలు చూసి ఆయనకు ఓటేయలేదని గుర్తుచేశారు. గడిచిన తొమ్మిదేళ్లుగా మన దేశాన్ని నడిపిస్తున్నారు.. ఇలాంటి సమయంలో ఆయన విద్యార్హతల గురించి, డిగ్రీల గురించి అడగడం అర్థరహితమని కొట్టిపారేశారు. దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం గురించి, నిరుద్యోగం గురించి మోడీని ప్రశ్నించాలని అన్నారు.

ప్రధాని మోడీ డిగ్రీల గురించి తెలుసుకుంటే దేశంలో ద్రవ్యోల్బణం తగ్గిపోతుందా..? లేక నిరుద్యోగ సమస్య సమసిపోతుందా అని అజిత్ పవార్ ప్రశ్నించారు. ఎన్నికలలో ఓటేసి గెలిపించిన నేత తన ఐదేళ్ల పాలనలో ఏం చేశాడనేదే ముఖ్యమని, ప్రజలు గమనించాల్సింది అదేనని సూచించారు. కాగా, ప్రధాని మోదీ డిగ్రీలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలంటూ ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆర్టీఐ చట్టం ద్వారా దరఖాస్తు చేయడంతో సీఐసీ స్పందించి గుజరాత్ యూనివర్సిటీకి ఆదేశాలిచ్చారు. దీనిపై గుజరాత్ వర్సిటీ కోర్టుకెక్కింది. ఈ కేసును విచారించిన గుజరాత్ హైకోర్టు.. మోదీ విద్యార్హతల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని తీర్పిచ్చింది. దీనిపై వివాదం రేగడంతో తాజాగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ స్పందించారు.