ప్రధాని బోరిస్ జాన్సన్​కు రాష్ట్రపతి భవన్​లో మోడీ ఘనస్వాగతం

YouTube video
PM Modi with British Prime Minister Boris Johnson at Ceremonial Reception, Rashtrapati Bhavan |

న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు విచ్చేసిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు ప్రధాని మోడీ ఘనస్వాగతం పలికారు. ప్రభుత్వ లాంఛనాలతో దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు సాదర స్వాగతం పలికారు. ఈ క్రమంలో కరచాలనంతో ఇరుదేశాధినేతలు ఒకరికొకరు అభివాదం చేసుకున్నారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌ను సందర్శించిన బ్రిటన్‌ ప్రధాని.. మహాత్మా గాంధీ స్మారకం వద్ద నివాళులు అర్పించారు. పూలు వేసి మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు. అనంతరం రాజ్‌ఘాట్‌ సిబ్బంది బోరిస్​కు జ్ఞాపిక అందజేశారు. తనకు ఘన స్వాగతం పలికినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

కాగా, ఈరోజు ప్రధాని మోడీ , బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్​ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు. ఉదయం 11:30కి హైదరాబాద్ హౌస్ లో భేటీ కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలతోపాటు ఉక్రెయిన్ తదితర ముఖ్యమైన అంశాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. దేశంలో ఆర్ధిక నేరాలకు పాల్పడి పారిపోయిన నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వంటి వారిని అప్పగించడంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. భారతదేశ వ్యతిరేక అంశాలు, యూకేలో ఖలిస్థాన్ మద్దతుదారుల వ్యవహారం కూడా చర్చకు రావచ్చు. అంతేకాకుండా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఇండో-పసిఫిక్‌ ప్రాంతం, ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలు సహా భారత్‌లో పెట్టుబడులు, బ్రిటన్‌లోని భారతీయులకు వీసాల సడలింపు వంటి అంశాలపై ప్రధానంగా భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/