కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రెండ్రోజుల పర్యటనకు ప్రధాని మోడి

కొచ్చిలో పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం

pm-modi-will-visit-adi-sankaracharya-house-in-kerala

న్యూఢిల్లీః ప్రధాని మోడి కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సాయంత్రం ఆయన కేరళలోని కొచ్చి చేరుకుంటారు. అక్కడ్నించి ఆది శంకరాచార్యుల జన్మస్థలం కాలడి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ శంకరాచార్యుల వారి నివాస గృహాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా శంకరాచార్యుల వారికి సంబంధించిన మరిన్ని విశేషాలను తెలుసుకుంటారు. ప్రధాని మోడీ తన కేరళ పర్యటనలో భాగంగా కొచ్చి మెట్రో, రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. రూ.4,500 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి. అటు, ఎర్నాకుళం జంక్షన్, ఎర్నాకుళం టౌన్, కొల్లం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేస్తారు. ఈ రాత్రికి కేరళలోనే బస చేయనున్న ప్రధాని మోడీ, రేపు ఉదయం కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను ప్రారంభిస్తారు.

అనంతరం, మధ్యాహ్నం బయల్దేరి కర్ణాటకలోని మంగళూరు చేరుకుంటారు. మంగళూరు ప్రాంతంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/