నేడు బెంగాల్, ఒడిశాలో ప్రధాని ఏరియల్ సర్వే
అంఫాన్ తుపాన్‌తో భారీగా నష్టపోయిన బెంగాల్, ఒడిశా

న్యూఢిల్లీ: అంఫాన్ తుపాన్ పశ్చిమ బెంగాల్, ఒడిశాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడి ఈరోజు ఆ రాష్ట్రలల్లో పర్యటించనున్నారు. అంఫాన్ కారణంగా ఏర్పడిన నష్టాన్ని ఆయన ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ఉదయం 10 గంటలకు ప్రధాని మోడి కోల్ కతా విమానాశ్రయానికి చేరుకొని బెంగాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. అంఫన్ తుఫాన్ కారణంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు భారీగా నష్టపోయాయి. రాష్ట్రంలో సుమారు రూ.లక్ష కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని స్వయంగా చూడాల్సిందిగా ప్రధాని మోడిని సీఎం మమతా బెనర్జీ ఆహ్వానించారు. ఈ క్రమంలో ప్రధాని మోడి ఏరియల్ సర్వే చేయనున్నారు. ‘నా జీవితంలో ఇలాంటి భయంకరమైన తుఫాన్‌ను చూడలేదు. ప్రధాని స్వయంగా వచ్చి నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించాలి.’ అని మమతా బెనర్జీ ఈరోజు ఉదయం ట్వీట్ చేశారు. అంతకు ముందు ప్రధాని మోడి స్పందిస్తూ నష్టపోయిన ఏ ఒక్కరినీ కూడా వదిలిపెట్టబోమని, అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/