13న సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం

న్యూఢిల్లీ : దేశంలో మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశాలున్నాయనే ఊహాగానాలు, ఆందోళనల నేపథ్యంలో ఈనెల 13న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు. కోవిడ్ వేరియంట్ ఒమెక్రాన్‌ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ విస్తరిస్తుండటం, మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యలో దేశంలోని ప్రస్తుత పరిస్థితిని ప్రధాని ఈ సమావేశంలో సమీక్షిస్తారు. 2020లో కోవిడ్ మహమ్మారి చెలరేగినప్పటి నుంచి ముఖ్యమంత్రులతో ప్రధాని పలుమార్లు సమావేశాలు జరిపారు.

కాగా, మరోసారి దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం, కొన్ని చోట్ల వారాంతపు కర్ఫ్యూలు, రాత్రి కర్ఫ్యూలు, ఆంక్షలు కఠినతరం చేస్తుండటంతో మళ్లీ దేశవ్యాప్త లాక్‌డౌన్ తప్పకపోవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. లాక్‌డౌన్‌‌ విధిస్తే ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు మరోసారి దెబ్బ తగిలే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. ప్రధాని మోడీ గత ఆదివారంనాడు దేశంలో కోవిడ్ పరిస్థితిని ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించారు. ఆరోగ్య మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు మిషన్ మోడ్‌లో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను మరింత వేగవంతం చేయాలని ప్రధాని ఈ సందర్భంగా సూచించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/