నివర్‌ తుపాను..కేంద్రం అన్ని విధాలా సాయం అందిస్తుందని భరోసా

జాగ్రత్తగా ఉండాలని తమిళనాడు,పుదుచ్చేరి సిఎంలకు చెప్పిన మోడి

pm modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి నివర్‌ తుపాను నేపథ్యంలో త‌మిళ నాడు, పుదుచ్చేరీల్లో పరిస్థితి పై ఆరాతీసారు. అక్కడి పరిస్థితులను గురించి తమిళ నాడు సిఎం ఇ.కె. పళనిస్వామితో, పుదుచ్చేరీ సిఎం వి. నారాయ‌ణ‌సామితో ప్రధాని మాట్లాడారు. ‘నివర్‌ తుఫాను ఫలితంగా త‌లెత్తిన స్థితి పై త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఇ.కె. పళనిస్వామితో, పుదుచ్చేరీ ముఖ్య‌మంత్రి వి.నారాయ‌ణ‌సామితోను మాట్లాడాను. కేంద్రం త‌ర‌ఫున అన్ని విధాలుగా సాయపడతామంటూ హామీని ఇచ్చాను’ప్ర‌భావిత ప్రాంతాల‌లో నివ‌సించే వారు భద్రంగా, క్షేమంగా ఉండాల‌ని నేను ప్రార్థిస్తున్నాను’అని ట్విట‌ర్ ద్వారా ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

కాగా, ‘నివర్’ తుపాను పంజా విసిరేందుకు శరవేగంగా దూసుకొస్తోంది. మరో 24 గంటల్లో ఈ తుపాను తీవ్ర తుపానుగా మారనుంది. తమిళనాడులోని మమాళ్లపురంకరైకల్ మధ్య ఇది తీరాన్ని దాటనుంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఈ తుపాను ప్రభావం తమిళనాడుపై తీవ్రంగా ఉండబోతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/