కాశీ ఆలయంలో సిబ్బందికి జూట్ పాదరక్షలు పంపించిన ప్రధాని

ఆలయంలో ఒట్టి కాళ్లతో సిబ్బంది దర్శనం

న్యూడిల్లీ: వారణాసి (కాశీ)లోని ప్రసిద్ధ విశ్వేశ్వరుడి ఆలయ (విశ్వనాథ్ మందిరం) సిబ్బందికి ప్రధాని మోడీ కానుకగా 100 జతల పాదరక్షలను పంపించారు. వీటిని జ్యూట్ తో తయారు చేయించారు. ప్రధాని మోడీ వారణాసి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండడం తెలిసిందే. కాశీ విశ్వనాథ్ ఆలయం పట్ల మోడీ ప్రత్యేక శ్రద్ధ కూడా చూపిస్తుంటారు. ఇటీవల విశ్వనాథుడి ఆలయ సందర్శన సమయంలో కాళ్లకు రక్షణ లేకుండా పనిచేస్తున్న సిబ్బందిని ప్రధాని చూశారు.

దేవాలయం అంటే పవిత్ర స్థలం కనుక అక్కడ జంతుచర్మంతో కానీ, రబ్బరుతో కానీ తయారుచేసిన పాదరక్షలు ధరించకూడదు. పూజారులు, భక్తులు, సెక్యూరిటీ సిబ్బంది ఎవరైనా బయట పాదరక్షలు విడిచి వెళ్లాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే, ప్రధాని అక్కడి సిబ్బందికి జనపనారతో తయారుచేసిన 100 జతల పాదరక్షలను ఆలయ సిబ్బందికి పంపించారు. ప్రధాని పంపిన ఈ పాదరక్షలను చూసి సిబ్బంది ఎంతగానో సంతోషించారని అధికారులు తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/