1,500 ప్లాంట్లు అందుబాటులోకి..ప్రధాని మోడీ

కరోనా మూడో వేవ్​ ముప్పు నేపథ్యంలో ఆక్సిజన్​ ప్లాంట్లపై ప్రధాని మోడి సమీక్ష

న్యూఢిల్లీ : కరోనా మూడో వేవ్ ముప్పు పొంచి ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆక్సిజన్ నిల్వలు, సరఫరాకు సంబంధించిన అంశాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సెకండ్ వేవ్ లో చాలా ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా కాకపోవడంతో ఎంత మంది చనిపోయారో తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందే అప్రమత్తమైంది. ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు దేశవ్యాప్తంగా ప్రెజర్ స్వింగ్ అడ్జార్ప్షన్ (పీఎస్ఏ) ఆక్సిజన్ ప్లాంట్లను కేంద్రం ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం వాటి నిర్మాణం వేగంగా జరుగుతోందని, త్వరలోనే 1,500 ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని ప్రధానికి అధికారులు వివరించారు. ఈ ప్లాంట్ల ద్వారా 4 లక్షల పడకలకు ఆక్సిజన్ ను సరఫరా చేయొచ్చని చెప్పారు.

వీలైనంత త్వరగా వాటిని ఏర్పాటు చేసి ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయాల్సిందిగా అధికారులను ప్రధాని ఆదేశించారు. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ, వాటిని ఆపరేట్ చేసే విధానంపై ఆసుపత్రుల సిబ్బందికి శిక్షణనివ్వాలని సూచించారు. దీనిపై ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించామని, 8 వేల మందికి శిక్షణనిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వివరించారు. ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని, వీలైనంత త్వరగా ఏర్పాట్లు పూర్తయ్యేలా చూసుకోవాలని అధికారులకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్లు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకు ఇంటర్నెట్ టెక్నాలజీలను విరివిగా వాడుకోవాలని చెప్పిన ఆయన.. అందులో భాగంగా ఏర్పాటు చేస్తున్న పైలెట్ ప్రాజెక్టు ఎంతవరకు వచ్చిందని అధికారులను ప్రశ్నించారు.

అయితే, ప్రజలు ప్రస్తుతం నిర్లక్ష్యంగా ఉంటున్నారని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కేసులు తగ్గుతున్నాయన్న సాకుతో చాలా మంది కరోనా నిబంధనలను పాటించట్లేదని అన్నారు. తీవ్రత తగ్గినా.. దాని ప్రమాదం ఇంకా పొంచే ఉందని, కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యం పనికిరాదని సూచించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/