భారత్‌ విజయంపై ప్రధాని ప్రశంసలు

టీమ్‌ఇండియాకు సిఎం కెసిఆర్‌, కెటిఆర్‌ అభినందనలు

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతమైన విజయంపై ప్రధాని మోడి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. భార‌త జ‌ట్టు విజ‌యానికి దేశ‌మంతా గ‌ర్విస్తోంద‌ని మోడి పేర్కొన్నారు. ఆట‌గాళ్లు త‌మ అభిరుచి, అద్భుత‌శ‌క్తిని ప్ర‌ద‌ర్శించారు అని ప్రధాని కొనియాడారు. భార‌త జ‌ట్టుకు మోడి శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు.


మరోవైపు టీమ్‌ఇండియాకు సిఎం కెసిఆర్‌, ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కెటిఆర్ అభినంద‌న‌లు తెలిపారు. కీల‌క ఆట‌గాళ్లు లేకున్నా అద్భుతం చేశార‌ని కేసీఆర్ ప్ర‌శంసించారు. ఈ విజ‌యం చిర‌స్మ‌ర‌ణీయంగా మిగిలిపోతుంద‌న్నారు. కెప్టెన్ ర‌హానేతో పాటు జ‌ట్టు స‌భ్యుల‌కు సిఎం కెసిఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. టీమ్‌ఇండియా ఆట‌గాళ్లు భార‌త్‌ను గ‌ర్వించేలా చేశారు అని పేర్కొంటూ రాష్ర్ట మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. ఇది చ‌రిత్ర‌లో నిలిచిపోయే విజ‌య‌మ‌ని పేర్కొన్నారు. 2021 సంవ‌త్స‌రాన్ని అద్భుతంగా ప్రారంభించారు అని కెటిఆర్ అన్నారు.


కాగా, ఆస్ట్రేలియాపై టీమ్‌ఇండియా అనిత‌ర సాధ్య‌మైన విజ‌యం సాధించింది. 32 ఏళ్లుగా ఓట‌మెరుగ‌ని బ్రిస్బేన్‌లో కంగారూల ప‌ని ప‌ట్టింది. గ‌బ్బా కోట‌ను బ‌ద్ధ‌లు కొట్టింది. 3 వికెట్ల తేడాతో చివరి టెస్ట్‌లో గెలిచి 21తో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మ‌న్ గిల్ (91), రిష‌బ్ పంత్(89 నాటౌట్‌) ఫైటింగ్ ఇన్నింగ్స్‌తోపాటు ఆస్ట్రేలియా పేస‌ర్ల బౌన్స‌ర్ల‌కు శ‌రీర‌మంతా గాయ‌ప‌డినా పోరాడిన పుజారా (56) టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో నిలిచిపోయే అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించిపెట్టారు. 328 పరుగుల భారీ ల‌క్ష్యాన్ని టీమిండియా ఛేదించ‌డం విశేషం.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/