ప్రజలకు నాణ్యమైన, చౌక ధరలకే ఆరోగ్య సంరక్షణ : ప్రధాని

ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా ట్విట్టర్లో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : నేడు ప్రపంచ ఆరోగ్య దినం (ఏప్రిల్ 7) ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్విట్టర్లో స్పందించారు. ‘‘ప్రపంచ ఆరోగ్యదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యంతో, శ్రేయస్సుతో ఆశీర్వదించబడాలి. ఆరోగ్య రంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపే రోజు కూడా. భారత ప్రభుత్వం ఆరోగ్య సదుపాయాల విస్తరణకు ఎంతో కష్టించి పనిచేస్తోంది. ప్రజలకు నాణ్యమైన, చౌక ధరలకే ఆరోగ్య సంరక్షణ అందించడంపై దృష్టి పెట్టాం. ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ కేర్ పథకం ‘ఆయుష్మాన్ భారత్’కు మన దేశం కేంద్రంగా ఉంది. ప్రతి భారతీయుడు గర్వపడే విషయం ఇది. పీఎం జన ఔషధి తదితర పథకాల లబ్ధిదారులతో మాట్లాడిన సందర్భంలో నాకు ఎంతో సంతోషం కలిగింది. అందుబాటు ధరలకే ఆరోగ్య సేవలు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు నేడు ఎంతో ఆదా అవుతోంది’’అని ప్రధాని పేర్కొన్నారు.

అదే సమయంలో ఆయుష్ నెట్ వర్క్ విస్తరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో మరింత శ్రేయస్సుకు దారితీస్తుందన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో వైద్యవిద్యలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు చోటు చేసుకున్నాయని చెబుతూ.. ఎన్నో వైద్య కళాశాలలు కొత్తగా అందుబాటులోకి వచ్చిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. దేశంలో ఆరోగ్య సదుపాయాలను బలోపేతం చేయడానికి తాము విరామం లేకుండా ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. నాణ్యమైన, అందుబాటు ధరలకే ఆరోగ్య సంరక్షణ, వైద్య సదుపాయాలను ప్రజలకు అందించడమే తమ ధ్యేయమని ప్రకటించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/