కశ్మీర్ నేతలతో అఖిలపక్ష సమావేశం ప్రారంభం

న్యూఢిల్లీ: అఖిలపక్ష నేతలతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఈ భేటీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నివాసంలో ప్రారంభమైంది. క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు చేసిన త‌ర్వాత ఈ భేటీ జ‌ర‌గడం విశేషం. జ‌మ్మూక‌శ్మీర్‌లో రాజ‌కీయ సుస్థిర‌త‌ను తీసుకురావాల‌న్న ఉద్దేశంతో స‌మావేశం నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్రానికి చెందిన‌ న‌లుగురు మాజీ సీఎంల‌తో పాటు మొత్తం 14 మంది నేత‌లు మీటింగ్‌కు హాజ‌ర‌య్యారు. ప్ర‌ధాని మోడీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ కూడా పాల్గొన్నారు. మాజీ సీఎంలు ఫారూక్ అబ్దుల్లా, ఒమ‌ర్ అబ్దుల్లా, మెహ‌బూబా ముఫ్తీ, గులాం న‌బీ ఆజాద్‌లు ఓపెన్ మైండ్‌తో మీటింగ్‌కు హాజ‌రైన‌ట్లు తెలిపారు.

అయితే జమ్మూ కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్రస్థాయి హోదాపై ఇస్తారనే ప్రచారం విస్తృతంగా జరగబోతోంది. ప్రస్తుతం జరుగుతోన్న సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు కూడా జరిపేందుకు కేంద్రం సముఖంగా ఉన్నట్లు సమాచారం. ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370 రద్దు అనంతరం రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు మాత్రమే జరిగాయి. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి అసెంబ్లీ ఉన్నప్పటికీ ఎన్నికలు జరపకుండా లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలోనే పాలన సాగిస్తూ వస్తున్నారు. అయితే రాష్ట్రానికి కొన్ని ఉద్దీపనలతో ఊరట కల్పించే యోచనలో కేంద్రం ఉందని ఓ వైపు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తమ రాష్ట్రం కోల్పోయిన హక్కులను తిరిగి సాధించుకుంటామని, ఈ విషయమై ప్రధానితో చర్చిస్తామని కశ్మీర్ నేతలు సమావేశానికి ముందు తేల్చి చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/