షాంఘై సహకార సంస్థ సదస్సు కోసం ఉజ్బెకిస్థాన్ చేరుకున్న ప్రధాని మోడీ

రెండు రోజులపాటు జరగనున్న 22వ ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు

pm-modi-in-uzbekistan-for-sco-summit-to-hold-talks-with-putin

న్యూఢిల్లీః నేడు ప్రధాని మోడీ ఉజ్బెకిస్థాన్ లో జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. ఎయిర్ పోర్టులో ప్రధాని మోడీకి ఉజ్బెకిస్థాన్ ప్రధాని అబ్దుల్లా అరిపోవ్ ఘన స్వాగతం పలికారు. కరోనా వల్ల రెండేళ్ల తర్వాత ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం, తైవాన్ విషయంలో చైనా వైఖరి వల్ల ఈ సదస్సు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రెండ్రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ప్రాంతీయ భద్రతా సవాళ్లు, వాణిజ్యం, ఇంధన సరఫరా పెంపు, ఉగ్రవాద నిర్మూలన అంశాలపై సభ్య దేశాల నేతలు చర్చించనున్నారు.

సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షావత్ మిర్జియోయెవ్ లతో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరాన్ అధినేతతో కూడా చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ తెలిపింది. అయితే, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో మోడీ.. ద్వైపాక్షిక చర్చలు జరుపుతారా? లేదా? అన్న విషయంలో స్పష్టత లేదు. సదస్సులో ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై వివిధ దేశాల అధినేతలతో అభిప్రాయాలు పంచుకుంటానని ప్రధాని మోడీ చెప్పారు. కూటమిని మరింత విస్తృతం చేయడం.. పరస్పర ప్రయోజనాల కోసం కూటమిలో సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తానన్నారు. పర్యాటక, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక రంగాలకు సంబంధించి కీలక నిర్ణయాలు ఉంటాయని ప్రధాని మోడీ అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/