మాతృమూర్తి మృతి.. బాధలోను విధులు నిర్వర్తించిన ప్రధాని మోడీ

హౌరా నుండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన మోడీ

YouTube video
PM Modi flags off Vande Bharat Express from Howrah and inaugurates Purple Line of Kolkata Metro

న్యూఢిల్లీః ప్రధాని మోడీ షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం బెంగాల్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే తల్లి హీరాబెన్‌ మృతితో ఆయన వర్చువల్‌గా పశ్చిమ బెంగాల్‌లో వందే భారత్‌ ఎక్స్ ప్రెస్ ప్రారంభించారు. హావ్‌డా, న్యూజల్‌పయ్‌గురిని కలిసే వందే భారత్‌ ఎక్స్ ప్రెస్ ‌ను మోడి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో బెంగాల్ సిఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ధన్యవాదాలు తెలియజేయడంతోపాటు, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడిన మాటలకు ప్రధాని కదిలించాయి.

‘‘పశ్చిమబెంగాల్ ప్రజల తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు. మీకు ఎంతో విషాదకరమైన రోజు నేడు. మీ అమ్మ మాకు కూడా అమ్మే. మీ సేవలు కొనసాగించేందుకు వీలుగా భగవంతుడు మీకు బలాన్ని ఇవ్వాలి. దయచేసి కొంత విశ్రాంతి తీసుకోండి. మీకు, మీ కుటుంబానికి ఏ విధంగా సానుభూతి వ్యక్తం చేయాలో నాకు తెలియడం లేదు. మీకు ఈ రోజు ఎంతో విచారకరమైనది. అయినా కానీ, ఈ కార్యక్రమానికి వర్చువల్ గా హాజరు కావడం అదొక గౌరవం. మీరు మీ పని ద్వారా మీ అమ్మగారి పట్ల గౌరవాన్ని చాటుకుంటున్నారు’’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.  ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ హాజరయ్యారు. 

కాగా, మోడీ మాతృమూర్తి హీరాబెన్‌ మోడీ శుక్రవారం తెల్లవారుజామున 3.39 గంటలకు కన్నుమూశారు. ఇటీవలే వందో పుట్టినరోజు పూర్తిచేసుకున్న ఆమె.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం రాత్రి అస్వస్థతకు గురవ్వడంతో ఆమెను అహ్మదాబాద్‌లోని యూఎన్‌ మెహతా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే, హీరాబెన్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని, రెండు లేదా మూడు రోజుల్లో డిశ్చార్జ్‌ చేస్తామని హాస్పిటల్‌ వర్గాలు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే ఆమె ఈ లోకాన్ని విడిచివెళ్లారు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/telangana/