మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే పనిలో ప్రధాని బిజీగా ఉన్నారు : కాంగ్రెస్‌

గువ‌హ‌టి : మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కూల్చే ప‌నిలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ బిజీగా ఉన్నార‌ని కాంగ్రెస్ ఎంపీ గౌర‌వ్ గ‌గోయ్ గురువారం ఆరోపించారు. వ‌ర‌ద‌ల‌తో కుదేలైన అసోంను సంద‌ర్శించి ప్ర‌త్యేక ప్యాకేజ్‌ను ప్ర‌క‌టించాల్సిన ప్ర‌ధాని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కూల‌దోయ‌డంలో, గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యార‌ని ఆక్షేపించారు. బీజేపీ అధికార దాహంతో ఉంద‌ని, ఆ పార్టీకి అధికార‌మే ముఖ్య‌మని ఆరోపించారు.

శివ‌సేన నేత ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో ప‌లువురు శివ‌సేన ఎమ్మెల్యేలు గువ‌హ‌టిలోని హోట‌ల్‌లో మ‌కాం వేయ‌గా మ‌హారాష్ట్ర‌లో ఉద్ధ‌వ్ ఠాక్రే సార‌ధ్యంలోని ఎంవీఏ ప్ర‌భుత్వం రాజ‌కీయ సంక్షోభంలో కూరుకుపోయింది. గువ‌హ‌టిలో సాగుతున్న క్యాంప్ రాజ‌కీయాల‌ను క‌వ‌ర్ చేస్తున్న ప్ర‌ధాన స్ర‌వంతి మీడియా సిల్చార్‌, క‌రీంగంజ్‌లో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌గండ్ల‌పైనా క‌థ‌నాలు రాయాల‌ని కోరారు.

ప్ర‌జ‌ల‌కు తాగేందుకు నీరు దొర‌క‌డం లేద‌ని, వ‌ర‌ద నీరు జ‌నావాసాల‌ను ముంచెత్తింద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. సాయం చేయాల‌ని త‌న‌కు ప‌లు ఫోన్లు వ‌స్తున్నాయ‌ని సాధ్య‌మైనంత సాయం అందించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. అసోంలో వ‌ర‌ద‌లు వ‌ణికిస్తుంటే కాషాయ పార్టీ, సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ మ‌హారాష్ట్ర రాజ‌కీయాల‌తో బిజీ అయ్యార‌ని మండిప‌డ్డారు. మ‌హారాష్ట్ర ఎమ్మెల్యేల‌కు రాజ‌మ‌ర్యాద‌లు చేయ‌డంలో సీఎం శ‌ర్మ నిమ‌గ్న‌మ‌య్యార‌ని ఆరోపించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/