బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనాకు స్వాగతం పలికిన ప్రధాని మోడీ

ప్రధాని మోడీతో హసీనా భేటీ.. కీలక ఒప్పందాలపై చర్చలు..

YouTube video
PM Modi attends ceremonial welcome of Bangladesh PM Sheikh Hasina at Rashtrapati Bhavan

న్యూఢిల్లీః బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత పర్యటన వచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం రాష్ట్రపతి భవన్‌‌కు చేరుకున్న షేక్‌ హసీనాకు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. భారత ప్రధానితో చర్చల నిమిత్తం దేశ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాకి సగౌరవంగా త్రివిధ దళాల సైనిక వందనంతో ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా భారత ప్రధాని నరేంద్ర మోడీపై పొగడ్తల వర్షం కురిపించారు. కోవిడ్‌ కాలంలోనూ, ఉక్రెయిన్‌ రష్యా యుద్ధసమయంలోనూ భారత్‌ అందించిన సాయం గొప్పదని కొనియాడారు. ఇరుదేశాల మధ్య స్నేహసంబంధాలు కొనసాగిస్తున్నామని, ఇరు దేశాల ప్రజల అభివృద్ధి ఆకాంక్షతో సమైక్యంగా ముందుకు సాగుతామని షేక్‌ హసీనా అన్నారు. పీపుల్స్ ఫెడరేషన్, పేదరిక నిర్మూలన, ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం తమ ప్రధాన కర్తవ్యమని హసీనా తెలిపారు. ఈ సమస్యలన్నింటిపై భారత్, బంగ్లాదేశ్ దేశాలు కలిసి పని చేస్తున్నాయని పేర్కొన్నారు. భారతదేశం – బంగ్లాదేశ్‌ సత్సంబంధాలతో దక్షిణ ఆసియా అంతటా ప్రజలకు మెరుగైన జీవనం లభిస్తుందని.. ఇదే తమ కర్తవ్యమని బంగ్లాదేశ్ ప్రధాని పేర్కొన్నారు.

కాగా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా 4 రోజుల భారత పర్యటనలో రక్షణ, వాణిజ్యం, నదీ జలాల భాగస్వామ్యం సహా పలు కీలక రంగాలలో భారత్‌తో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. హసీనా ప్రతినిధి బృందంలో పలువురు మంత్రులు వాణిజ్య మంత్రి టిప్పు మున్షీ, రైల్వే మంత్రి ఎండీ నూరుల్ ఇస్లాం సుజన్, లిబరేషన్ వార్ మంత్రి ఎకెఎం మొజమ్మెల్ హక్ ఉన్నారు. ఆగస్టు 25న ఢిల్లీలో జరిగిన భారత్-బంగ్లాదేశ్ జాయింట్ రివర్స్ కమిషన్ (జేఆర్‌సీ) 38వ మంత్రివర్గ స్థాయి సమావేశంలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) ఖరారు చేశారు.

తాజా తెలంగణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/