ఎన్‌హెచ్ఆర్‌సీ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని

YouTube video
PM Modi attends 28th NHRC Foundation Day programme

న్యూఢిల్లీ : ప్ర‌ధాని మోడీ జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘం (ఎన్‌హెచ్ఆర్‌సీ) వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా ఆయ‌న ఆ కార్య‌క్ర‌మంలో మాట్లాడారు. ట్రిపుల్ త‌లాక్‌కు వ్య‌తిరేకంగా ముస్లిం మ‌హిళ‌లు కొన్ని ద‌శాబ్ధాలుగా చ‌ట్టాన్ని డిమాండ్ చేస్తున్నార‌ని, ట్రిపుల్ త‌లాక్ చ‌ట్టాన్ని తెచ్చి వారికి కొత్త హ‌క్కుల్ని క‌ల్పించామ‌ని, హ‌జ్ స‌మ‌యంలో మ‌హ‌ర‌మ్( మ‌గ తోడు) నిబంధ‌న నుంచి విముక్తి క‌ల్పించిన‌ట్లు ప్ర‌ధాని మోడీ తెలిపారు. గ‌త ఏడేళ్ల‌లో 60 కోట్ల జ‌నాభా క్షేమాన్ని చూసుకున్న‌ట్లు ప్ర‌ధాని చెప్పారు. వారికి ఒక‌రు ఉన్నార‌న్న భ‌రోసా ఇచ్చిన‌ట్లు తెలిపారు. ప‌ది కోట్ల మంది మ‌హిళ‌ల‌కు టాయిలెట్లు ఏర్పాటు చేశామ‌న్నారు. 4 కోట్ల ఇండ్ల‌కు విద్యుత్తు స‌ర‌ఫ‌రా క‌ల్పించిన‌ట్లు వెల్ల‌డించారు. స‌బ్‌కా సాత్‌, స‌బ్‌కా వికాస్‌, స‌బ్‌కా ప్ర‌యాస్ ల‌క్ష్యంతో దేశం ముందుకు వెళ్తోంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రి మాన‌వ హ‌క్కుల్ని ర‌క్షించే మౌళిక సూత్రాల ఆధారంగా ప‌నిచేస్తున్నామ‌న్నారు.

ప్ర‌భుత్వం ఏదైనా స్కీమ్ రూపొందిస్తే, దాంతో కొంద‌రికి మాత్ర‌మే ల‌బ్ధి చేకూరుతుంద‌ని, దాని వ‌ల్ల హ‌క్కుల అంశం బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని మోడీ అన్నారు. అందుకే అంద‌రికీ ప‌థ‌కాలు అందే ల‌క్ష్యంతో ముందుకు వెళ్తున్న‌ట్లు ప్ర‌ధాని చెప్పారు. స‌మాన‌త్వ అంశంపై ప్ర‌పంచానికి మ‌న రాజ్యాంగం కొత్త దృక్ప‌థాన్ని క‌ల్పించింద‌ని, గ‌త కొన్ని ద‌శాబ్ధాలుగా కొన్ని దేశాలు త‌మ ల‌క్ష్యాల నుంచి దారిమ‌ళ్లాయ‌ని, కానీ ఇండియా మాత్రం త‌న సూత్రాల‌కు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. ఉద్యోగం చేస్తున్న గ‌ర్భిణి మ‌హిళ‌ల‌కు 26 వారాల మెట‌ర్నిటీ లీవ్‌ను క‌ల్పిస్తున్న‌ట్లు ప్ర‌ధాని చెప్పారు. శిశువు హ‌క్కుల ర‌క్ష‌ణ‌లో ఇది కీల‌కం అన్నారు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం 700 జిల్లాల్లో వ‌న్‌స్టాప్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశామ‌ని, వాటిల్లో మెడిక‌ల్‌, పోలీస్‌, మెంట‌ల్ కౌన్సిలింగ్ ఉంటుంద‌న్నారు. 650 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశామ‌న్నారు. అత్యాచారం లాంటి హేయ‌మైన నేరాల‌కు మ‌ర‌ణ‌శిక్ష‌ల‌ను విధిస్తున్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/