మేం నమ్మినవాళ్లే మమ్మల్ని అవసరానికి ఆదుకోలేదు: పాశ్చాత్య దేశాలపై ప్రధాని మోడీ

పాపువా న్యూగినియాలో ఇండియా -పసిఫిక్ ఐలాండ్స్‌ కోఆపరేషన్ సమావేశం

PM Modi at Pacific Forum in Papua New Guinea

పోర్ట్‌ మోరెస్బీః ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ సమావేశాల్లో (ఎఫ్‌ఐపీఐసీ) భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం పశ్చిమదేశాలపై పరోక్ష విమర్శలు చేశారు. నమ్మిన వాళ్లే తమను అవసరానికి ఆదుకోలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎఫ్‌ఐపీఐసీ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రస్తుతం మోడీ పాపువా న్యూగినియా దేశంలో ఉన్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఆయన ప్రపంచంపై కొవిడ్ ప్రభావం గురించి మాట్లాడారు. కొవిడ్ ప్రభావం లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, ఓషియానా దేశాలపై అధికంగా ఉందన్నారు. వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు, పేదరికం, ఆరోగ్య పరమైన సమస్యలకు తోడు కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయని ప్రధాని మోడీ తెలిపారు. అయితే, ఆపద సమయాల్లో భారత్ తన మిత్రదేశాలకు ఎప్పుడూ అండగా నిలిచిందని చెప్పారు.

ఈ క్రమంలో మోడీ పాశ్చాత్య దేశాలపై పరోక్ష విమర్శలు చేశారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా చమురు, ఆహారం, ఎరువులు, ఔషధాల సరఫరా వ్యవస్థల్లో సమస్యలు తలెత్తాయి. ఈ కష్టసమయంలో, మేం నమ్మినవాళ్లే మమ్మల్ని అవసరానికి ఆదుకోలేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పావువా న్యూగినియా అధ్యక్షుడు జేమ్స్ మరాపే మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ఆధిపత్యం కోసం అంతర్జాతీయంగా జరుగుతున్న ఆటలో మేం బాధితులం. కానీ, లాటిన్ అమెరికా, ఆసియా, ఓషియానా దేశాలకు మీరే నాయకుడు. ప్రపంచవేదికలపై మీ వెంటే మేం నడుస్తాం’’ అని జేమ్స్ మరాపే వ్యాఖ్యానించారు.