బోరిస్, మోడీ సంయుక్త మీడియా సమావేశం

సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్ లా పొంగిపోయా..ప్రధాని బోరిస్ జాన్సన్

YouTube video
PM Modi and UK PM Johnson at joint press meet

న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్​తో భేటీ అయ్యారు. ఇరు దేశాలకు చెందిన ప్రతినిధి బృందాలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాయి. రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. అనంతరం బోరిస్, మోడీ సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మోడీ మాట్లాడుతూ.. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​’ సమయంలోనే బోరిస్​ భారత పర్యటనకు రావడం చారిత్రకమన్నారు.

“గత కాప్​ 26 సమావేశంలో చేసుకున్న వాగ్దానాలను నేరవేర్చేందుకు కట్టుబడి ఉండాలనుకుంటున్నాం. భారత జాతీయ​ హైడ్రోజన్ మిషన్​లో చేరాలని బ్రిటన్​ను ఆహ్వానించాం. స్వేచ్ఛ, బహిరంగ, సమ్మిళిత, నియమ ఆధారిత ఇండో పసిఫిక్​ ప్రాంతం ఉండాలని నొక్కి చెబుతున్నాం. గతేడాది భారత్-బ్రిటన్​ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రారంభించాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్​టీఏ) సంబంధిత పనులు జరుగుతున్నాయి. రక్షణ రంగం, వాణిజ్యం, వాతావరణం, ఇంధనం వంటి రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించాం. ఇండో పసిఫిక్ ప్రాంతంపై కూడా చర్చిస్తాం. ఇవేగాక అంతర్జాతీయ అంశాలపైనా చర్చించాం. ఉక్రెయిన్​లో కాల్పుల విరమణ జరిగి తక్షణం చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించువాలని కోరుతున్నాం.”

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. గుజరాత్ లో లభించిన అమోఘమైన స్వాగతానికి తాను ఫిదా అయ్యానన్నారు. ఆ స్వాగత ఏర్పాట్లతో తాను సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లా పొంగిపోయానన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఓ నిఖార్సైన స్నేహితుడని చెప్పుకొచ్చారు. భారత్ తో బంధాన్ని మరింత దృఢం చేసుకునే అనేక అంశాలపై తాము చర్చించామని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. దీపావళి నాటికి స్వేచ్ఛా వాణిజ్యంపై ఒప్పందాన్ని ఫైనలైజ్ చేస్తామన్నారు. దీపావళి నాటికి విధివిధానాలకు తుదిరూపునివ్వాల్సిందిగా అధికారులను కోరామన్నారు. పలు వస్తువులు, సామగ్రిపై భారత్ టారిఫ్ లను తగ్గించడం అభినందనీయమని, అందుకు బదులుగా తాము కూడా కొన్ని టారిఫ్ లను తగ్గిస్తున్నామని ప్రకటించారు.

రక్షణ పరికరాలు, ఉత్పత్తులకు సంబంధించి డెలివరీ టైమ్ ను తగ్గిస్తున్నామని, భారత్ కు ప్రత్యేకంగా జనరల్ ఎక్స్ పోర్ట్ లైసెన్స్ ను రూపొందిస్తున్నామని చెప్పారు. రక్షణ రంగంలో సరికొత్త విస్తృత భాగస్వామ్యానికి నాంది పడిందన్నారు. ఇండో పసిఫిక్–రీజియన్ లో భద్రతను పెంపొందించేందుకు భారత్ తో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. భారత్ కు యుద్ధ విమానాల కొత్త సాంకేతికతలు, హెలికాప్టర్లు, జలాంతర్గాముల వంటి వాటిని భారత్ కు అందజేస్తామన్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/