పీఎం కిసాన్ డబ్బులు వచ్చేది అప్పుడే..

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతుల ఖాతాల్లో ఆరు వేల రూపాయిలు కేంద్రం జమ చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు విడతలుగా ఈ డబ్బులను జమ చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో 11 విడతల్లో డబ్బులు జమ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు 12 వ విడుత డబ్బుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు సెప్టెంబర్ 1న విడుదల కావొచ్చని తెలుస్తోంది. ఈ డబ్బులు పొందాలంటే రైతులు కచ్చితంగా ఇకేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి. దీనికి గడువు జూలై 31తో ముగుస్తుంది. సాధారణంగా ఇకేవైసీ గడువు మే 31తోనే ముగియాల్సి ఉంది. అయితే ప్రభుత్వం తర్వాత ఈ డెడ్‌లైన్‌ను పొడిగించింది. ఇటీవలనే పీఎం కిసాన్ స్కీమ్‌లో కొన్ని మార్పులు చేసింది.

బెనిఫీషియరీ స్టేటస్ చెకింగ్ విధానాన్ని మార్చింది. ఇప్పుడు కేవలం రిజిస్ట్రేషన్ నెంబర్ లేదంటే మొబైల్ నెంబర్ ద్వారా మాత్రమే స్టేటస్ తెలుసుకోవడం వీలవుతుంది. అలాగే మొబైల్ నెంబర్ ఓటీపీ తప్పనిసరి. ఇదివరకు ఇలా లేదు. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ తెలుసుకునే వాళ్లు. లేదంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ద్వారా స్టేటస్ చెక్ చేసే వారు. మొబైల్ నెంబర్ సాయంతో స్టేటస్ చెకింగ్ కూడా ఉండేది.
ప్రధాని మోదీ మే 31న పీఎం కిసాన్ 11వ విడత డబ్బులను విడుదల చేశారు. 10 కోట్ల మందికి పైగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో రూ. 21 వేల కోట్ల జమ చేశారు. అయితే కొంత మంది రైతులు మాత్రం ఈ డబ్బులు రాలేని పేర్కొంటున్నారు. డబ్బులు ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చు. దీని కోసం రైతులకు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి స్టేటస్ చెక్ చేసుకోవాలి. అందులో డబ్బులు ఎందుకు రాలేదో కారణం ఉంటుంది. దాన్ని సరిచేసుకుంటే సరిపోతుంది. మళ్లీ డబ్బులు వస్తాయి.